– 2050 నాటికి దేశంలో వృద్ధుల సంఖ్య రెట్టింపు
– ఆరోగ్యం, గృహ నిర్మాణం, పెన్షన్‌పై దృష్టి సారించాలి
– సమ్మిళిత వృద్ధి సాధించాలి : యూఎన్‌ఎఫ్‌పీఏ భారత్ చీఫ్ ఓజ్‌నర్
న్యూఢిల్లీ : 2050 నాటికి దేశంలో వృద్ధుల సంఖ్య రెట్టింపు అవుతుందని యునైటెడ్ నేషన్స్ ఫర్ పాప్యులేషన్ యాక్టివిటీస్ (యూఎన్‌ఎఫ్‌పీఏ) భారత విభాగం అధిపతి ఆండ్రూ ఓజ్‌నర్ తెలిపారు. వృద్ధుల సంఖ్య పెరగనున్నందున వారి ఆరోగ్య రక్షణ, గృహనిర్మాణం, పెన్షన్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని ఆమె చెప్పారు. ముఖ్యంగా ఒంటరిగా నివసిస్తూ, పేదరికంతో జీవిస్తున్న వృద్ధ మహిళల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ నెల 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆండ్రూ ఓజ్‌నర్ పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ సమ్మిళిత వృద్ధిని వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అరవై సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య 2050 నాటికి 34.6 కోట్లకు చేరుతుందని ఓజ్‌నర్ తెలిపారు. భారత్‌లో 10-19 సంవత్సరాల మధ్య వయసున్న వారి సంఖ్య 25.2 కోట్లుగా ఉన్నదని ఆమె చెప్పారు. దేశాన్ని సమ్మిళిత వృద్ధి దిశగా ముందుకు నడిపించాలంటే ఆరోగ్యం, విద్య, ఉద్యోగ శిక్షణపై పెట్టుబడులు పెంచాలని, లింగ సమానత్వాన్ని సాధించాలని సూచించారు. 2050 నాటికి దేశంలో యాభై శాతం పట్టణ ప్రాంతంగానే ఉంటుందని అంటూ మురికివాడలను అభివృద్ధి చేయడానికి, వాయు కాలుష్యాన్ని అడ్డుకోవడానికి, పర్యావరణ సంబంధమైన సమస్యలను పరిష్కరించడానికి స్మార్ట్ సిటీలు నిర్మించాలని, పటిష్టమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. మహిళలు సురక్షితంగా, భద్రంగా ఉండేలా చూసేందుకు పట్టణ ప్రణాళికలు రూపొందించుకోవాలని, వారికి ఆరోగ్య రక్షణ కల్పించాలని, విద్య, ఉద్యోగ అవకాశాలు అందించాలని ఓజ్‌నర్ కోరారు. లింగ సమానత్వాన్ని సాధించాలని, మహిళలు నాణ్యమైన జీవితాన్ని పొందేలా చూడాలని చెప్పారు. వలసవాదులు, ఒంటరి మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అంటూ వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆండ్రూ ఓజ్‌నర్ సూచించారు.