ఫీవర్‌ ఫియర్‌..!

– ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు రోగులు క్యూ
– ఓపీలో సగం జ్వర పీడితులే..
– జిల్లా, ఏరియా, యూపీహెచ్‌సీలదీ అదే పరిస్థితి
నవతెలంగాణ-సిటీబ్యూరో/ధూల్‌పేట్‌
వాతావరణం మారడం, వరుసగా వర్షాలు కురవడం, పారిశుధ్య నిర్వహణ పడకేయడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఫలితంగా గల్లీ, కాలనీ, మున్సిపాల్టీ, కార్పొరేషన్‌ అనే తేడా లేకుండా జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్‌ నగరంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. నగరంలోని ప్రధాన ఆస్పత్రులైన గాంధీ, ఉస్మానియాతోపాటు కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి, ఏరియా హాస్పిటల్స్‌, యూపీహెచ్‌సీలకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ఈ ఆస్పత్రుల్లోని ఓపీలో సగం మంది సీజనల్‌ వ్యాధులతో బాధపడుతున్న వారే ఉన్నారు.
దగ్గు, జ్వరం, జలుబు..
సీజనల్‌ వ్యాధులతో హైదరాబాద్‌ జనం అల్లాడుతున్నారు. ఎడతెరిపివ్వని వర్షాలు, దోమల పెరుగుదల, పారిశుధ్యం మూలంగా వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. జ్వరం, దగ్గు, జలుబు, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలతో జనం రెండు, మూడ్రోజులుగా ఆస్పత్రులకు ఎక్కువగా క్యూ కట్టారు. గాంధీ ఆస్పత్రిలో సాధారణ ఓపీతో పోలిస్తే 10 రోజుల నుంచి రోగుల సంఖ్య పెరిగింది. ఇక్కడికి ప్రస్తుతం రోజూ దాదాపు 3,500 వరకు రోగులు వస్తున్నారు. ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి సాధారణ రోజుల్లో వెయ్యి నుంచి 1500 వరకు ఓపీ ఉండగా.. ప్రస్తుతం 1700 నుంచి 2వేల మంది వరకు వస్తున్నారు. కింగ్‌కోఠి హైదరాబాద్‌ జిల్లా హాస్పిటల్‌కు సైతం రోగుల తాకిడి ఎక్కువగానే ఉంది. ప్రతి రోజూ వెయ్యి మందికి తగ్గకుండా రోగులు వస్తున్నారు. హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో ఉన్న నాలుగు ఏరియా ఆస్పత్రులకు రోజుకు 400 వరకు ఓపీ ఉంటుంది. యూపీహెచ్‌సీలకు సాధారణ రోజుల్లో 50 వరకు ఓపీ ఉండగా.. ప్రస్తుతం 100కు పైగా ఉంటుంది. ఈ ఓపీల్లో సగం వరకు సీజనల్‌ వ్యాధుల బారిన పడిన వారే ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. వారం రోజులుగా వాతావరణ మార్పులతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు వైద్యులు చెబతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మూడేండ్లుగా మలేరియా కేసులు పెద్దగా నమోదు కాలేదు. డెంగ్యూ కేసులు ఏటా వస్తున్నాయి. 2021లో 4 వేలు, 2022లో మరో నాలుగు వేల డెంగ్యూ కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 500కు పైగా కేసులు బయట పడ్డాయి. రెండు, మూడు నెలల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.
పాత రోగులు.. కొత్త రోగులు..
రోగుల తాకిడి ఎక్కువగా ఉన్న ఆస్పత్రులకు వచ్చే వారిలో ఇది వరకు డాక్టర్లను సంప్రదించి మరోసారి చూపించుకునేందుకు వచ్చే కేసులు కూడా ఉంటున్నాయి. కొత్తగా ఓపీకి వచ్చేవారి వివరాలు నమోదు చేసి, డాక్టర్లను సంప్రదించే వరకు గంటల సమయం పడుతోంది. దీంతో పేషెంట్లు లైన్‌లో గంటల కొద్దీ నిలబడాల్సి వస్తుండటంతో మొదటిసారి ఓపీ కోసం వచ్చిన వారికి ఆలస్యమవుతోంది. పాత రోగులు, కొత్త రోగులు కలిసి వస్తుండటంతో ఆస్పత్రుల ఓపీ విభాగాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
నాలుగు రోజుల మెడిసిన్‌
జ్వరం, దగ్గు, నీరసం, జలుబు, ఒంటి నొప్పులు లాంటి లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే పేషెంట్లకు వైద్యులు మొదట నాలుగు రోజులకు సరిపడా మెడిసిన్‌ రాసిస్తున్నారు. తగ్గకుంటే మరోసారి రావాలని సూచిస్తున్నారు. రెండోసారి వస్తే టెస్టులకు రెఫర్‌ చేస్తున్నారు. బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్లకు పంపుతున్నారు. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ శాంపిల్స్‌ ఫలితాలు రావడానికి దాదాపు 24 గంటల వరకు సమయం పడుతోంది.
వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతాయి. కలుషిత నీరు, ఫుడ్‌కు దూరంగా ఉండాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. వేడి ఆహారం తీసుకోవాలి. వాతావరణంలో మార్పులు, కలుషిత నీటితో వాంతులు, విరేచనాలు, డయేరియా బారిన పడే ప్రమాదం ఉంటుంది. వరదలు తగ్గాక దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, కలరా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే రోగాల బారినపడకుండా ఉండొచ్చు.
డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ ఆస్పత్రి

Spread the love