ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట

Fight against anti-people policies– నవంబరు 26న దేశవ్యాప్త ఆందోళనలు
– 500 జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు : కేంద్ర కార్మిక సంఘాలు,
సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు
న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ నేతృత్వ ఎన్డీఏ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శ్రామికలోకం ఉద్యమానికి సంసిద్ధమైంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వచ్చే నవంబరు 26న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని, 500 జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాల వేదిక (సీటీయూ), సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) నిర్ణయించాయి. ఈ మేరకు గురువారం సీటీయూ, ఎస్కేఎం సంయుక్త సమావేశం ఢిల్లీలోని హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ భవన్‌లో జరిగింది. మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న కార్పోరేట్‌, మతోన్మాద విధానాలకు, ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని సమావేశం తీర్మానించింది. కోవిడ్‌ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో 2020లో లాక్‌డౌన్‌ విధించిన సమయంలో కేంద్ర కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె చేపట్టాయి. అదే ఏడాది కర్షకలోకం చారిత్రాత్మక రైతు పోరాటాన్ని సాగించింది. ఈ రెండు పోరాటాల నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నవంబరు 26న దేశవ్యాప్తంగా భారీ ప్రజా సమీకరణతో ప్రదర్శనలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువకులు, విద్యార్థులు తదితర అన్ని సంఘాలు, ప్రజా వేదికలు ఈ పోరాటంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర కార్మిక సంఘాల నుండి తపన్‌ సేన్‌ (సీఐటీయూ), అమర్జీత్‌ కౌర్‌ (ఏఐటీయూసీ), అశోక్‌ సింగ్‌ (ఐఎన్‌టీయూసీ), హర్భజన్‌ సిద్ధూ (హెచ్‌ఎంఎస్‌), ఆర్‌కె శర్మ (ఎఐయూటీయూసీ), రాజీవ్‌ దిమ్రీ (ఎఐసీసీటీయూ), సోన్యా జార్జ్‌ (ఎస్‌ఈడబ్ల్యుఎ), రాకేష్‌ మిశ్రా (టీయూసీసీ), శత్రుజీత్‌ (యూటీయూసీ), అలాగే ఎస్కేఎం నాయకులు డాక్టర్‌ అశోక్‌ ధావలే, డాక్టర్‌ దర్శన్‌ పాల్‌, రాజన్‌ క్షీరస్గర్‌, రాజారామ్‌ సింగ్‌, హన్నన్‌ మొల్లా తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం
మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పలు రాష్ట్రాల్లో జరుగనున్న ఉప ఎన్నికల్లోనూ బీజేపీని ఓడించేందుకు ప్రచారం నిర్వహించాలని ఎస్కేఎం రైతులకు, ప్రజలకు పిలుపునిచ్చింది. ‘బీజేపీని సాగనంపుదాం..బీజేపీని వ్యతిరేకిద్దాం..శిక్షిద్దాం’ పేరిట విస్తృత ప్రచార కార్యాక్రమాలను చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ భవన్‌లో జరిగిన ఎస్కేఎం జనరల్‌ బాడీ సమావేశంలో తీర్మానించారు. రాష్ట్ర జాబితాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను అగ్రికల్చర్‌ మిషన్‌ పేరుతో లాక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఎస్కేఎం నేతలు విమర్శించారు. ఎరువులకు ఇస్తున్న రాయితీలోనూ ఎన్డీఏ ప్రభుత్వం భారీగా కోతలు విధించిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టే నయవంచక విధానాలను మోడీ సర్కార్‌ అనుసరిస్తోందని, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు దానికి వత్తాసు పలుకుతున్నాయని తప్పుబట్టారు. ఈ సమావేశానికి అధ్యక్షవర్గంగా ఎస్కేఎం నేతలు జగ్‌మోహన్‌ సింగ్‌, హన్నన్‌ మొల్లా, రాజన్‌ క్షీరసాగర్‌, పద్మ పశ్యం, జోగిందర్‌ సింగ్‌ నైన్‌, సిదాగౌడ మోదగి, డాక్టర్‌ సునీలం ఉన్నారు.
డాక్టర్‌ దర్శన్‌ పాల్‌ నివేదికను ప్రవేశపెట్టారు. పి కృష్ణ ప్రసాద్‌ ముగింపు ఉపన్యాసం చేశారు. శ్రమజీవుల డిమాండ్లను నెరవేర్చడానికి ఎన్డీఏ-3 ప్రభుత్వానికి మూడు నెలల వ్యవధి ఇస్తున్నట్లు సీటీయూ, ఎస్కేఎం నేతలు తెలిపారు. ఈ గడువు లోగా తమ డిమాండ్లను నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా నిరవధిక పోరాటాలకు సిద్ధమవుతామని తెలిపారు. వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

Spread the love