స్వదేశీ వస్త్ర ఉద్యమస్ఫూర్తితో బీజేపీ విధానాలపై పోరు

In the spirit of the Swadeshi textile movement Fight over BJP policies– చేనేత కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలి : తెలంగాణ చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు
– హైదరాబాద్‌లో బాపూఘాట్‌ వద్ద జాతీయ చేనేత దినోత్సవం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గాంధీ పిలుపునిచ్చిన స్వదేశీ వస్త్ర ఉద్యమ స్ఫూర్తితో చేనేత రంగం నిర్వీర్యానికి బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై పోరు చేయాలనీ, అందులో చేనేత కార్మికులంతా ఐక్యంగా కదిలి రావాలని చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌లో గల బాపూఘాట్‌ వద్ద చేనేత జాతీయ దినోత్సవాన్ని నిర్వహించారు. గాంధీ విగ్రహానికి నూలుదండ వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వస్త్రవ్యాపారం పేరుతో ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో అడుగుపెట్టి దేశాన్నే ఆక్రమించుకున్నదన్నారు. చేనేత వస్త్రాలపై, నూలు, పట్టు, రంగులు, రసాయనాలపై పన్నుల భారం మోపి ఆ దేశ వస్త్రాలపై సుంకాలను తగ్గించి మన దేశంలోకి ప్రవేశపెట్టారని చెప్పారు. మన దేశంలోని పత్తిని ఇంగ్లాండ్‌కు కారుచౌకగా తీసుకెళ్లి అక్కడ బట్టలు తయారు చేసేవారనీ, అక్కడ నుంచి వస్త్రాలను దిగుమతి చేసి సొమ్ము చేసుకున్నారని వివరించారు. ఇలాంటి తరుణంలోనే జాతీయోద్యమంలో చేనేత రంగం ఒక ఆయుధమైందనీ, విదేశీ వస్త్ర బహిష్కరణ నినాదాన్ని గాంధీ ఇచ్చారని గుర్తుచేశారు. అంతటి ప్రాధాన్యత గల చేనేతను మన పాలకులూ క్రమంగా నిర్వీర్యం చేస్తూ పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్‌గాంధీ నూతన జౌళి విధానం తీసుకొచ్చి చేనేతను తీవ్రంగా దెబ్బతీశారని తెలిపారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత వస్త్ర తయారీకి అవసరమయ్యే ముడిసరుకులపై జీఎస్టీ, తయారైన బట్టలపై మళ్లీ జీఎస్టీ వేస్తుండటంతో చేనేత రంగం కుదేలవుతున్నదని విమర్శించారు. కేంద్రంలోని మోడీ సర్కారు వస్త్రపరిశ్రమను దెబ్బతీసి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నదన్నారు. మహాత్మాగాంధీ బునకర్‌ బీమా యోజన పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం, ఐసీఐసీఐ లాంబాడ్‌ హెల్త్‌ స్కీమ్‌, హౌస్‌ కమ్‌ వర్క్‌షెడ్‌ పథకాలకు కేంద్రం తిలోదకాలిస్తున్నదని విమర్శించారు. 11 రకాలకే రిజర్వేషన్లను కుదించిందని తెలిపారు. చేనేత రంగానికి కేంద్రం ఏటేటా నిధులను తగ్గిస్తూ పోతున్నదని విమర్శించారు. ఓవైపు చేనేత రంగాన్ని దెబ్బతీస్తూనే మరోవైపు బీజేపీ నేతలు నేతన్నలను ఆదుకుంటాం అంటూ దీక్షలు, ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేశ్‌ మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం వేసిన సత్యం కమిటీ చేనేత వృత్తినే మానుకోవాలని దారుణమైన సిఫారసులు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పోచంపల్లి ఇక్కత్‌ డిజైన్‌కు పేటెంట్‌ హక్కు ఉందనీ, జియోగ్రఫీ సర్టిఫికెట్‌ ఉన్నా మిల్లులు యథేచ్ఛగా ఇక్కత్‌ డిజైన్‌ను మిషన్లపై ప్రింట్‌ చేయడం అన్యాయమని తెలిపారు. దీనిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పాలకులు అనుసరిస్తున్న విధానాలతో చేనేత కార్మికులు ఆకలి చావులతో, ఆత్మహత్యలతో తనువు చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికుమార్‌, మాజీ అధ్యక్షులు బడుగు శంకరయ్య, ఉపాధ్యక్షులు ముషం నరహరి, వర్కాల చంద్రశేఖర్‌, రావిరాల మల్లేశ్‌, మల్లేశం, వెంకటేశ్‌, పెంటయ్య, ఎస్‌.శంకరయ్య, పాండు, యాదగిరి, నరేశ్‌, గోవర్ధన్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love