కార్మికుల పక్షాన..పోరాడేది ఎర్రజెండానే

– సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి మల్లికార్జున్‌ను గెలిపించండి
– భారీ బైక్‌ ర్యాలీ ముగింపు సభలో చుక్క రాములు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
కార్మికుల పక్షాన పోరాడేది ఒక్క ఎర్రజెండా మాత్రమేనని అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి మల్లికార్జున్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు కోరారు. ఆదివారం పటాన్‌చెరు నియోజకవర్గంలోని బీరంగూడ నుంచి రామచంద్రాపురం, పటాన్‌చెరు మీదుగా సాగిన బైక్‌ ర్యాలీ రుద్రారంలో ముగిసింది. వేలాది మంది సీపీఐఎం కార్యకర్తలు, నాయకులు ఎర్రజెండాలు చేతబూని భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కార్మికుల కనీస వేతనాల కోసం పోరాడిన పార్టీ సీపీఐఎం ఒక్కటేనన్నారు. ఎమ్యెల్యేగా పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులందరూ యాజమాన్యాల ప్రయోజనాల కోసం పని చేస్తారు తప్ప కార్మికుల వేతనాలు, సమస్యల గురించి పట్టించుకోరన్నారు. సెటిల్‌మెంట్లు, రియల్‌ దందాలు చేసి దండుకున్న డబ్బులతో ఓట్లను కొనుగోలు చేయాలని చూస్తున్న పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పాలన్నారు. నీతి, ఉజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్న సీపీఐఎం అభ్యర్థిని గెలిపించుకుంటే పటాన్‌చెరు ఉయోజకవర్గం ఎంతో అభివద్ధి చెందేందుకు అవకాశముందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లెవ్వరూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడిన పాపాన పోలేదన్నారు. సీపీఐఎంను గెలిపిస్తే చట్ట సభలో ప్రజల గొంతుకై నినదించడంతో పాటు కనీస వేతనాలు, ఇళ్లు ఇళ్ల స్థలాల సమస్యను సాధించుకునే అవకాశముందన్నారు. పారిశ్రామిక ప్రాంతమైన పటాన్‌చెరులో రీన్న వెయ్యికి పైగా కంపెనీల్లో లక్షలాది మంది కార్మికఉలు శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. సీపీఐఎం పోరాడిన ఫలితంగానే కొన్ని కంపెనీల్లో కార్మికులకు కనీస వేతనాలు అందుతున్నాయని, పర్మినెంట్‌ చేస్తున్నారన్నారు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలివ్వట్లేదన్నారు. కనీస సదుపాయాలకు కూడా నోచుకోవడం లేదన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం కొంత పారిశ్రామిక ప్రాంతం కాగా ఇంకొంత వ్యవసాయాధారమైన ప్రాంతంగా ఉందన్నారు. రైతులు, కూలీలు, పేదలు, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, యువకులు ఇలా అన్ని వర్గాల ప్రజల గురించి పోరాటాలు చేసే ఎర్రజెండాకు ఓటు వేయాలని కోరారు. సీపీఐఎం అభ్యర్థి మల్లికార్జున్‌ కార్మికుడిగా పని చేశారని, అనేక కార్మికోద్యమాలకు నాయకత్వం వహించారన్నారు. ఆయన్ను గెలిపించుకోవడం ద్వారా నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసేందుకు అవకాశముంటుందన్నారు. నియోజకవర్గ ప్రజలెదుర్కొంటున్న కాలుష్యం, రోడ్లు, ఇళ్లు, ఇళ్లస్థలాలు సమస్యలపై ఇప్పటికే సీపీఐఎం అనేక పోరాటాలు చేసిందన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే అన్ని సమస్యల్ని పరిష్కరించే వరకు ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చేందుకు వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎం అభ్యర్థి జె.మల్లిఖార్జున్‌, జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, సీపీఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.రాజయ్య, బీరం మల్లేశం, అతిమేల మాణిక్‌, జి.సాయిలు, నాయిఉ నర్సింహ్మరెడ్డి, రామచంద్రం, జిల్లా నాయకఉలు నాగేశ్వర్‌రావు, ప్రవీణ్‌, యాదగిరి, విద్యా సాగర్‌, మహిపాల్‌, పాండురంగారెడ్డి, వాజీద్‌, అశోక్‌, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love