– అవార్డు అందుకున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ పోలీసులకు ఫిక్కి స్టార్ట్ పోలీసింగ్ %ు%2022 అవార్డు దక్కింది. చైల్డ్ సేఫ్టీ కేటగిరీలో ‘వర్క్‌సైట్ స్కూల్ ప్రొగ్రాం’ కి ఈ అవార్డు వరించింది. శుక్రవారం నాడిక్కడ ఫిక్కీ ఆడిటోరియంలో బీఎస్‌ఎఫ్ మాజీ డైరక్టర్ జనరల్ పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రకాశ్ సింగ్, సీఐఎస్‌ఎఫ్ మాజీ స్పెషల్ డీజీ మంజరి జరుహర్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అరవింద్ గుప్తా చేతుల మీదుగా మహేశ్ భగవత్ ఈ అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల పోలీసు శాఖలు, 6 కేంద్ర పారామిలటరీ బలగాల నుంచి వచ్చిన 117 ఎంట్రీల్లో రాచకొండ పోలీసులు చేపట్టిన ఆ కార్యక్రమమే మిన్నగా నిలిచింది. అనంతరం మహేశ్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ… రాచకొండ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో హైదరాబాద్ నగర శివార్లలోని ఇటుక బట్టీల్లో పొరుగు రాష్ట్రాలకు చెందిన బాల కార్మికులు పనిచేస్తున్న విషయం తెలిసి, వాటిపై దాడులు జరిపించి బాలకార్మికులకు విముక్తి కల్పించినట్లు చెప్పారు. ఇటుక బట్టీలు, ఇతర ప్రమాదకర పనుల్లో నిమగమైన బాల కార్మికులను రక్షించి, వారికి పాఠశాల విద్యను అందించాలని భావించినట్లు తెలిపారు. అయితే ఈ బట్టీల్లో పనిచేస్తున్న పిల్లల్లో అత్యధికులు ఒరిస్సా, మహారాష్ట్రకు చెందినవారేనని గుర్తించామన్నారు. వారికి వారి మాతృ భాషలోనే పాఠశాల విద్యను అందించడం కోసం ‘వర్క్‌సైట్’ స్కూళ్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, ఇటుక బట్టీ యజమానుల అసోసియేషన్, ఫిక్కీతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కోరి తీసుకున్నట్లు వెల్లడించారు.