– ఎస్సీ జనాభాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించాలి
– ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి : కేంద్ర మంత్రికి ఏఐఏడబ్ల్యూయూ బృందం వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బ్యాక్‌లాగ్ పోస్ట్‌లను వెంటనే భర్తీ చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ను ఏఐఏడబ్ల్యూయూ నేతలు బి.వెంకట్, వి.శివదాసన్ (రాజ్యసభ ఎంపీ), విక్రమ్ సింగ్‌లతో కూడిన బృందం కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రయివేట్ రంగాలలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలోని షెడ్యూల్డ్ కులాలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరారు. షెడ్యూల్డ్ కులాల జనాభా శాతానికి తగిన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి సరైన కేటాయింపులు, నిధుల వినియోగం ఉండేలా సబ్ ప్లాన్ చట్టాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గాల భాగస్వామ్యం, సాధికారతను మెరుగుపరచడానికి విద్యా, ఉపాధి, పారిశ్రామిక రంగాలలో షెడ్యూల్డ్ కులాలకు తగిన వనరులు ఉండేలా చూసుకోవాలని కోరారు. ప్రమోషన్లలో రిజర్వేషన్ల రాజ్యాంగ రక్షణను అనుసరించాలని డిమాండ్ చేశారు. దళితులపై అఘాయిత్యాలను నిరోధించడానికి ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టాన్ని స్ఫూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూమిలేని వారికి భూమిని పంపిణీ చేయాలని, అందరికీ ఇండ్లు ఉండేలా చూడాలని కోరారు. ఈ డిమాండ్లపై చర్యలు వేగవంతం చేయాలని కోరారు. మంత్రితో చర్చలు ఫలవంతమయ్యాయని, తక్షణ సమస్యలను పరిష్కరిస్తానని, సంబంధిత విధానపరమైన విషయాలపై కృషి చేస్తానని కేంద్ర మంత్రి ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తెలిపారు.