– ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ ముగించిన సుప్రీం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మార్గదర్శి చిట్ ఫండ్ కేసు బదిలీపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. తెలంగాణ హైకోర్టులోనే తుది వాదనలు వినిపించుకోవాలని స్పష్టం చేసింది. మార్గదర్శి సంస్థపై ఏపీ సీఐడీ పోలీసులు నమోదుచేసిన కేసులకు సంబంధించిన అంశాలను విచారించే న్యాయపరిధి తమకు ఉందంటూ తెలంగాణ హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది. విచారణ నిర్ణయం ఇప్పటికే జరిగినందున మళ్లీ విచారణ అవసరం లేదని పేర్కొంది. మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజా కిరణ్ పై కఠిన చర్యలు వద్దన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని తెలిపింది. మార్గదర్శి సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్, నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపించారు.