సిద్ధరామయ్య దగ్గర ఆర్థిక శాఖ..

నవతెలంగాణ – బెంగళూరు: కర్ణాటకలో పూర్తి స్థాయి మంత్రి మండలిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా మంత్రులకు శాఖలను కేటాయించింది. ఊహాగానాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు నీటిపారుదలతో పాటు, బెంగళూరు నగర అభివృద్ధి శాఖలను కేటాయించారు. త్వరలో జరగబోయే బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డీకేకే ఆ శాఖను అప్పగించినట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కర్ణాటక సర్కారు మంత్రిత్వ శాఖల కేటాయింపులపై ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీఎం సిద్ధరామయ్య ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహించి 13 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి కూడా ఆర్థికశాఖను తానే చూడనున్నారు. దీంతో పాటు క్యాబినెట్‌ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్‌, సమాచార, ఐటీ, మౌలికసదుపాయాల అభివృద్ధి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ పర్సనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ రిఫామ్స్‌ వంటి శాఖలను తనే అట్టిపెట్టుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ఖర్గేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖలు, ఏకైక మహిళా మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు మహిళా, శిశు సంక్షేమ శాఖ, వృద్ధులు, దివ్యాంగుల సాధికారిత శాఖలను అప్పగించారు. మాజీ సీఎం బంగారప్ప కుమారుడు మధు బంగారప్పకు ప్రాథమిక, ఉన్నత విద్య శాఖలు, రామలింగారెడ్డికి రవాణాశాఖను కేటాయించారు. దినేశ్‌ గుండురావుకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, కృష్ణ బైరెగౌడకు రెవెన్యూ, సతీశ్ జర్ఖిహోళికి ప్రజా వ్యవహారాలు, హెచ్‌సీ మహదేవప్పకు సామాజిక సంక్షేమ శాఖలను కేటాయించారు.

Spread the love