– ఇబ్బందుల్లో మూడింట ఒక వంతు మంది
– పెరిగిన కిరాణా సామగ్రి వ్యయం : కాంతర్ రిపోర్ట్
న్యూఢిల్లీ : భారత్‌లోని దాదాపు మూడింట ఒక వంతు మంది తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఇప్పటికే భారీగా పెరిగిన ధరలని స్పష్టమవుతోంది. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయి నుంచి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ వినియోగదారులు తమ ఖర్చులను నిర్వహించడం కష్టంగా మారిందని మార్కెట్ పరిశోధన సంస్థ కాంతర్ తన ఎఫ్ఎంసిజి పల్స్ రిపోర్ట్‌లో పేర్కొంది.
”ద్రవ్యోల్బణం కొంత స్థాయికి తగ్గుముఖం పట్టి ఉండవచ్చు. కానీ దాని ప్రతిఫలం వినియోగదారునికి చేరలేదు. రెండేళ్ల క్రితం నాటితో పోల్చితే మార్చి 2024తో ముగిసిన తొలి త్రైమాసికం(క్యూ1)లో సగటు వినియోగదారుడి వ్యయం 18 శాతం పెరిగింది. మూడు నెలలకు గాను ఒక సాధారణ భారతీయ కుటుంబ ఖర్చు రూ.49,418కి పెరిగింది. గ్రామీణ ప్రాంతంలోనూ రూ.41,215గా నమోదయ్యింది. గ్రామీణ కుటుంబాలతో పోల్చితే పట్టణ ప్రాంతం వారు ఆరు రెట్లు ఎక్కువ వ్యయం చేస్తారు. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు మూడు మాసాల్లో కేవలం రూ.38,000 ఖర్చు చేస్తాయి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చుల కంటే 0.9 రెట్లు ఎక్కువ.” అని కంతార్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. దేశంలోని దక్షిణ ప్రాంతం ఇప్పుడు అత్యధికంగా ఖర్చు చేస్తుందని వెల్లడించింది. గత రెండేళ్లలో ఈ ప్రాంత ఖర్చులు 35 శాతం పెరిగాయని పేర్కొంది. త్రైమాసికంలోని మొత్తం వ్యయాల్లో 24 శాతం కిరాణా సామగ్రికే సరిపోతుంది.
జూన్ 2022 నుండి గృహోపకరణాలపై ఖర్చు 19 శాతం పెరిగింది. ఇది గృహ ఖర్చులలో త్రైమాసికానికి రూ.2,000 పెరిగింది. దీంతో కుటుంబాలు తమ ఖర్చులను నిర్వహించడం కష్టంగా మారింది. ఈ లెక్కన దేశంలో మూడవ వంతు కుటుంబాలు ఇప్పటికీ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాయి.