హైదరాబాద్ మెట్రోకు ఫైన్..

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రయాణికుడికి ఇబ్బంది కలిగించినందుకు గాను హైదరాబాద్ మోట్రో రైల్ సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. తప్పుడు సైన్ బోర్డులతో ప్రయాణికుడి సమయాన్ని వృథా చేసినందుకు రూ. 5 వేల ఫైన్, కేసు ఖర్చుల కోసం అదనంగా రూ. వెయ్యి చెల్లించాలని ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళ్తే… సైదాబాద్ కు చెందిన అబ్దుల్ ఖాదిర్ అనే న్యాయవాది 2022 డిసెంబర్ 16న హఫీజ్ పేట్ కు వెళ్లేందుకు మెట్రో రైల్ ఎక్కారు. దిల్ సుఖ్ నగర్ నుంచి మలక్ పేట వరకు మెట్రో రైల్లో ప్రయాణించాడు. అక్కడ దిగి సైన్ బోర్డులు (దిక్కుల సూచికలు) చూస్తూ తన మెట్రో కార్డును ట్యాప్ చేశాడు. కొంతం దూరం వెళ్లిన తర్వాత తాను వెళ్లాల్సిన మార్గం మరోవైపు ఉందని గుర్తించాడు. కార్డు అప్పటికే ట్యాప్ చేయడంతో అతను మళ్లీ వెనక్కి వెళ్లేందుకు మెట్రో సిబ్బంది అనుమతించలేదు. దీంతో అసహనానికి గురైన ఖాదిర్ వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. మెట్రో వల్ల తన విలువైన సమయం వృథా అయిందని కమిషన్ కు తెలిపాడు. సైన్ బోర్డులు సరిగా లేకపోవడం వల్ల తాను ఇబ్బంది పడ్డానని చెప్పాడు. దీంతో మెట్రోకు ఫైన్ విధించిన కమిషన్… 30 రోజుల్లో సరైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

Spread the love