కేంద్ర మంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూపై ఎఫ్‌ఐఆర్‌

కేంద్ర మంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూపై ఎఫ్‌ఐఆర్‌
                                  కేంద్ర మంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూపై ఎఫ్‌ఐఆర్‌

నవతెలంగాణ – బెంగళూరు : కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూపై బెంగళూర్‌లోని హై గ్రౌండ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఇటీవల కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని నెంబర్‌వన్‌ టెర్రరిస్టు అని, దేశానికి శత్రువని బిట్టూ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. బిట్టూ చేసిన ఈ అనుచిత వ్యాఖ్యల ఆధారంగా కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు మేరకు ఈరోజు ఆయనపై కేసు నమోదైంది.
కాగా, రాహుల్‌ గాంధీ భారతీయడు కాదని, ఆయన తన జీవితకాలంలో అధిక సమయం విదేశాల్లోనే గడుపుతారని, విదేశీ పర్యటనల్లో భారత్‌ గురించి తప్పుగా మాట్లాడతారని, ఆయనకు దేశం పట్ల ప్రేమ లేదని కేంద్ర మంత్రి బిట్టూ దుయ్యబట్టారు. వేర్పాటువాదులు, బాంబులు, తుపాకీలు తయారుచేసేవారు, మోస్ట్‌ వాంటెడ్‌ పీపుల్స్‌ మాత్రమే రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను ప్రశంసిస్తారని ఎద్దేవా చేశారు. విమానాలు, రైళ్లు, రహదారులను తగులబెట్టే దేశ శత్రువులే రాహుల్‌ను సమర్థిస్తారని బిట్టూ వ్యాఖ్యానించారు. దేశానికి అతిపెద్ద శత్రువు, నెంబర్‌ వన్‌ టెర్రరిస్ట్‌ను ఎవరినైనా పట్టుకోవాలంటే అది రాహుల్‌ గాంధీ మాత్రమేనని ఆయన మండిపడ్డారు. బిట్టూ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ కార్యకర్తలు మండిపడ్డారు. ఢిల్లీలోని బిట్టూ నివాసం, కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. అయితే ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించిన కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బిజెపి నేతలు రాహుల్‌కి క్షమాపణలు చేప్పాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

Spread the love