– ఎం.ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్స్ ప్రదర్శనపై కోర్టు
న్యూఢిల్లీ: ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్ హుస్సేన్ రూపొందించిన ‘అభ్యంతరకర’ పెయింటింగ్స్‌ను ప్రదర్శించిన విషయంలో ఢిల్లీ ఆర్ట్ గ్యాలరీ (డీఏజీ)పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించలేమని ఢిల్లీ కోర్టు తెలిపింది. ఫిర్యాదుదారు అయిన ఢిల్లీకి చెందిన న్యాయవాది అమిత సచ్‌దేవా వద్ద తన ఆరోపణలను నిరూపించటానికి అవసరమైన అన్ని ఆధారాలు ఇప్పటికే ఉన్నాయని పేర్కొన్నది. ఈ మేరకు ఫిర్యాదు కేసుగా కొనసాగాలని పాటియాల హౌజ్ కోర్టు జ్యుడీషియల్ మేజిస్ట్రేటు సాహిల్ మోంగా ఆదేశించారు. ” ప్రస్తుత కేసులో కేసు అన్ని వాస్తవాలు, పరిస్థితులు ఫిర్యాదుదారునికి తెలుసు. ఢిల్లీ ఆర్ట్ గ్యాలరీ సీసీటీవీ ఫుటేజీ, ప్రశ్నార్థకమైన పెయింటింగ్‌లు ఇప్పటికే సీజ్ అయ్యాయి. ఈ దశలో, దర్యాప్తు సంస్థ వైపు నుంచి తదుపరి దర్యాప్తు, ఆధారాల సేకరణ అవసరం లేదు” అని న్యాయస్థానం తెలిపింది. తర్వాతి దశలో ఎఫ్‌ఐఆర్ అవసరమైతే, భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్)లోని సెక్షన్ 225ను ఆశ్రయించొచ్చని చెప్పింది. గత డిసెంబర్‌లో డీఏజీని ఫిర్యాదుదారు సందర్శించారు. ఆ సమయంలో ‘అభ్యంతరకరమైన’ పెయింటింగ్స్‌ను గుర్తించారు. దీనిపై ఫిర్యాదు చేయటానికి పోలీసులను ఆమె ఆశ్రయించారు. అయినప్పటికీ.. ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. ఆ తర్వాత ఆమె డీఏజీని సందర్శించినపుడు ఆ పెయింటింగ్స్‌ను తొలగించారు. తాము అభ్యంతరకరమైన పెయింటింగ్స్‌ను ప్రదర్శించామన్న ఆరోపణను గ్యాలరీ అధికారులు తోసిపుచ్చారు. దీంతో ఈ విషయంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 299 కింద డీఏజీ ఓనర్లకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.