నల్లగొండ ప్రభుత్వఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

Fire accident in Nalgonda Government Hospital– మాతా శిశు సంరక్షణ కేంద్రంలో కెమికల్‌ రియాక్షన్‌తో మంటలు
– పసి పిల్లలతో బయటకు పరుగులు తీసిన బాలింతలు, గర్భిణీలు
– కిటికీ అద్దాలను ధ్వంసం చేసి పొగను బయటికి పంపిన ఫైర్‌ సిబ్బంది
– సంఘటనా స్థలాన్ని సందర్శించిన కలెక్టర్‌ కర్ణన్‌
నవతెలంగాణ -నల్లగొండ కలెక్టరేట్‌
నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 7.30 గంటల సమయంలో పసిపిల్లల వార్డులోని స్టోర్‌రూం నుంచి ఒక్కసారిగా మంటలు, పొగ రావడంతో బాలింతలు, గర్భిణీలు బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా పొగ కమ్ముకుంది. పేషెంట్లు, బంధువులు, కుటుంబ సభ్యులు పసిపిల్లలను చేతులతో ఎత్తుకుని బయటకు వెళ్లారు. ఫైర్‌ సిబ్బంది కిటికీ అద్దాలను ధ్వంసం చేసి పొగను బయటికి పంపించారు.అగ్నిప్రమాదం కెమికల్‌ రియాక్షన్‌ వల్లే జరిగిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ లచ్చు నాయక్‌ తెలిపారు. రోగులకు ఎలాంటి ఇబ్బందీ జరగలేదని, సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి మంటలను ఆర్పేసినట్టు చెప్పారు. అగ్ని ప్రమాదంతో సుమారు రూ.80 వేల నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అందులో బిల్డింగ్‌, గ్లాస్‌, ఫర్నీచర్‌, ల్యాబ్‌, యాసిడ్‌ ఫినాయిల్‌ టీన్స్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ బ్యాగులు, శానిటైజర్‌, శానిటేషన్‌ సామాగ్రి కాలిపోయాయి. ఆస్పత్రి మాతా శిశు కేంద్రం సబ్‌ స్టోర్‌ రూంలో మంటలు వచ్చిన విషయం తెలియగానే కలెక్టర్‌ అర్‌.వి.కర్ణన్‌ సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. అనంతరం ఆస్పత్రిని సందర్శించి మాతా శిశు కేంద్రం సబ్‌ స్టోర్‌ రూంను పరిశీలించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగ లేదని, ఆస్పత్రి, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి కిటికీలను పగల గొట్టి పొగ బయటికి పోయేలా చేసి.. మంటలను ఆర్పేశారని సూపరింటెండెంట్‌ వివరించారు. బాత్రూం క్లీన్‌ చేసే సల్ప్యూరిక్‌ ఆసిడ్‌ ద్రావణంలో బ్లీచింగ్‌ పౌడర్‌ కలవడం వల్లే ప్రమాదం జరిగినట్టు కలెక్టర్‌కు చెప్పారు.
అదనపు ఓపీలు ప్రారంభించాలి.
మాతా శిశు కేంద్రంలో ఓపీలో పెద్ద ఎత్తున మహిళలు లైన్‌లో ఉండటాన్ని చూసిన కలెక్టర్‌.. అదనంగా రెండు మూడు ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్‌ డా.లచ్చు నాయక్‌ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్‌రావు తదితరులు ఉన్నారు.

Spread the love