రాంనగర్‌లో అగ్ని ప్రమాదం..

నవతెలంగాణ – హైదరాబాద్: రామ్ నగర్ లోని ఓ వస్త్ర దుకాణంలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వి ఎస్ టి నుంచి రాంనగర్ కు వెళ్లే దారిలో ఉన్న వైష్ణవి మ్యాచింగ్ అండ్ సారీ సెంటర్ యజమాని రాత్రి షాపు మూసి వేసి వెళ్లిపోయారు. కాగా రాత్రి 7 గంటల ప్రాంతంలో షాప్ లో పొగ తో కూడిన మంటలు చెలరేగాయి. అవి కాస్త బయటికి ఎగిసిపడ్డాయి. అగ్ని ప్రమాదం జరిగి మంటలు వ్యాపించడం పై అంతస్తులో నివాసం ఉంటున్న వారు గమనించి షాపు యజమాని సందీప్ కి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. షాప్ సెట్టర్లు తెరుచుకోకపోవడంతో జెసీబీ సహాయంతో షట్టర్లను తొలగించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. చిక్కడపల్లి సీఐ రాజు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love