రత్నదీప్ సూపర్ మార్కెట్ లో అగ్ని ప్రమాదం

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రారంభానికి సిధ్దంగా ఉన్న ప్రముఖ షాపింగ్ మాల్ రత్నదీప్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండల పరిధిలోని బండ్లగూడలో రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంకా కొంత మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్ ను సిబ్బంది మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టంగా నల్లటి పొగ వ్యాపించింది. దీంతో మంటలను చూసిన సిబ్బంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.  సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. నార్సింగి సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Spread the love