ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం

Fire at Fishing Harbour– విశాఖలో 36 బోట్లు పూర్తిగా, 9 పాక్షికంగా దగ్ధం
– సుమారు రూ.15.కోట్లు ఆస్తి నష్టం
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 36 బోట్లు పూర్తిగా, 9 పాక్షికంగా దగ్ధమయ్యాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లి వచ్చిన బోట్లను చేపలరేవులోని జెట్టీల వద్ద నిలిపి ఉంచారు. ఆదివారం అర్ధరాత్రి మొదటి బోటుకు నిప్పు అంటుకుని పక్క పక్కనే ఉన్న బోట్లకు ఆగ్ని కీలలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో గాలులు అధికంగా వీయటం, వేలాది లీటర్ల డీజిల్‌ బోట్లలో ఉండటంతో ప్రమాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ ఆకస్మిక ఘటనతో మత్స్యకారులు హడలిపోయారు. హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. అగ్నిమాపక అధికారులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పడం ప్రారంభించారు. అగ్నిమాపక అధికారులు, నేవీ సిబ్బంది ఐఎన్‌ఎస్‌ సహారా షిప్‌ ద్వారా మంటలు ఆర్పడం, త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టడంతో ఉదయం 6 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో మొత్తం రూ.15 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని, ఒక్కో బోటు ఖరీదు రూ.40లక్షల నుంచి రూ.80లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఘటన స్థలాన్ని ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు సోమవారం పరిశీలించారు. ఘటనకు గల కారణాల దర్యాప్తు వేగవంతం చేశామని, అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో నష్టపరిహారం అందేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులను వైసీపీ, సీపీఐ(ఎం), సీపీఐ, టీడీపీ, జనసేన, ఆప్‌ పార్టీల నాయకులు పరామర్శించారు.

Spread the love