నవతెలంగాణ-హైదరాబాద్ : పాతబస్తీలోని పురానాఫూల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పురానాఫూల్ స్మశాన వాటిక సమీపంలోని ఓ కెమికల్ గోదాంలో మంగళవారం(ఆగష్టు 13) మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. గమనించిన సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే గోదాం సిబ్బంది అగ్ని మాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో నిమిషాల వ్యవధిలో ఐదు ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఎంత శ్రమిస్తున్నప్పటికీ, మంటలు అదుపులోకి రావడం లేదు. కెమికల్ గోదాం కావడంతో డబ్బాలు ఒక్కొక్కటిగా పేలుతున్నాయి. దాంతో, మంటలు మళ్లీ మళ్లీ చెలరేగుతున్నాయి. ఘటన జరిగిన గోదాం పక్కనే మరికొన్ని కెమికల్ గోదాంలు ఉండటంతో స్థానికుల్లో ఏం జరుగుతుందో అన్న భయం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.