”నాన్నా, నాకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది.!” ఇంటి గడపలో కాలు పెట్టీపెట్టక ముందే అరచినట్టుగా చెప్పాడు రమేష్.
సుందరయ్య చెవిలో అమృతం పోసినట్టుగా అయింది. భోజనానికి కూర్చోబోతున్న వాడు దిగ్గున లేచి పరుగున వచ్చి కొడుకును బిగియార కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ”తండ్రి కోరిక తీర్చి కొడుకుగా నీ రుణం తీర్చుకున్నావు కదరా! ఎంత కష్టపడ్డావు ఈ సీటు కోసం? రోజుకు ఇరవై గంటలు చదివావు. చదువులో పడి చిక్కిపోతున్నావని మీ అమ్మ బెంగ. మీ అమ్మకు ఏం తెలియదు! ఎంబిబిఎస్‌లో సీటు రావాలంటే మాటలా? ఎంత కష్టపడి చదివితే మెడిసిన్‌లో సీటు రావాలి! అడిగినవాడికి, అడగని వాడికి నా కొడుకును డాక్టరును చేయడమే నా ధ్యేయం అని చెప్పుకునేవాడిని. నావి వుత్త గప్పాలుగా మిగిలి పోకుండా మెడిసిన్లో సీటు తెచ్చుకుని నా పరువు నిలబెట్టావు!”
తనకీ డాక్టర్ కావాలన్న కోరిక! తెల్లకోటు మీద వ్యామోహం ఈనాటిది కాదు. ‘నా కొడుకును డాక్టర్ని చేస్తా’ అని నాన్న నోటినుండి తరుచుగా రావడం వల్లనేమో తన ఆలోచనలు కూడా అటే ప్రయాణం చేశాయి. లక్షలు లక్షలు డొనేషన్ కట్టి చదివించే శక్తి తండ్రికి లేదు. కష్టపడి చదివి ఫ్రీ సీటు తెచ్చుకుంటే తప్ప మెడికల్ కాలేజీలో సీటు రాదని తెలుసు కాబట్టి కష్టపడి చదవడం చిన్నప్పటి నుండి అలవాటు చేసుకున్నాడు. ఫస్ట్ మార్కులే తెచ్చుకునేవాడు. కాని కిందటి సారి పరీక్షల్లో సీటు తెచ్చుకోలేక పోయాడు. తన కంటే తండ్రి ఎక్కువ బాధ పడ్డాడు. పల్లెలో పొలం అమ్మైనా డొనేషన్ కట్టి నిన్ను మెడిసిన్ చదివిస్తానని ఆవేశపడిపోయాడు. తండ్రికి తను పుట్టి పెరిగిన ఆ పల్లె అన్నా, కొద్దిపాటి ఆ పొలం అన్నా ఎంతిష్టమో తనకు తెలుసు. ఉద్యోగం నుండి రిటైర్ కాగానే పల్లెకు వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతమైన జీవనం గడపాలని ఉందని చెప్పే తండ్రి తన చదువుకోసం పొలం అమ్మితే ఊరితో సంబంధాలు తెంపుకున్నట్టే అవుతుంది. చివరి రోజుల్లో పల్లెలో ప్రశాంతంగా జీవించాలన్న ఆయన కోరికకు తన చదువు కారణంగా శాశ్వతంగా తలుపులు మూసుకున్నట్టు అవుతుంది. అందుకే రమేష్ ఒప్పుకోలేదు.
”వచ్చే సంవత్సరం ఇంకా కష్టపడి చదివి ఫ్రీ సీటు తెచ్చుకుంటాను, నాన్నా! నువ్వు పొలం అమ్మడానికి వీల్లేదు” అని అడ్డుపడ్డాడు.
అన్నట్టుగానే సీటు తెచ్చుకున్న కొడుకును చూసి గర్వంతో ఉప్పొంగి పోయాయి ఆయన గుండెలు. తెల్లకోటులో, మెడలో స్టెతస్కోప్‌తో హుందాగా ఉన్న కొడుకు రూపాన్ని ఊహించుకుంటుంటే ఆనంద బాష్పాలు కళ్ళను మసకబారేలా చేశాయి సుందరయ్యను.
చిన్న ఉద్యోగి, మధ్యతరగతి మనిషి, కొడుకు డాక్టర్ అయితే డాక్టర్ తండ్రిగా తన హోదా ఒక్కసారిగా పెరిగిపోతుంది అనుకున్నాడు సుందరయ్య. తనిప్పుడు అనామకుడు కాదు!
భర్తలా బయట పడకపోయినా అలివేలుకీ కొడుకు డాక్టర్ అవుతున్నాడంటే ఆనందంగానే వుంది.
***
అదొక కార్పొరేట్ హాస్పిటల్. రోగులు, తమకు తోడుగా తెచ్చుకున్న బంధువులతో, అక్కడ పనిచేసే స్టాఫ్‌తో కిటకిటలాడి పోతూంది.
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బామ్మర్ది వెంట అతడికి తోడుగా ఆసుపత్రికి వచ్చాడు శంకర్రావు. సుందరయ్యకు చిన్నాయన కొడుకు. రమేష్‌కు బాబాయి వరుస అవుతాడు. పేషంట్లకి ఇంజెక్షన్లు ఇచ్చే చోట రమేష్‌ను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. మెడికల్ కాలేజీలో వుండాల్సిన కుర్రవాడు ఇక్కడ కాంపౌండరు అవతారం ఎత్తడమేమిటో అర్థం కాలేదు ఆయనకు.
రోగులకు ఇంజెక్షన్లు ఇస్తున్న యువకుడు ‘రమేష్’ అన్న పిలుపు విని తలెత్తి పోలీసును చూసి పారిపోయే దొంగలా చటుక్కున జనాలను చాటుచేసుకుంటూ అక్కడి నుండి మాయమైపోయాడు. శంకర్రావు ఆసుపత్రి అంతా తిరిగి చూసినా ఎక్కడా కనిపించలేదు రమేష్.
మరునాడు కూడా బావమరిది వెంట వెళ్ళాల్సి వచ్చింది శంకర్రావుకు. రమేష్ కనిపించగానే మెరుపులా వెళ్ళి చెయ్యిపట్టుకున్నాడు. ”నిన్న నన్ను చూసి ఎందుకు పారిపోయావు?”
”నేనెందుకు పారిపోయాను? అసలు మీరెవరు?”
”బాబాయినే గుర్తించనంత గొప్పవాడివైపోయావా? మెడిసిన్‌లో సీటు రాగానే కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి!”
”నన్ను చూసి మీరు ఎవరి ననుకుంటున్నారో! నా పేరు మోహన్…”
”ఆహా? మోహన్‌వో, రమేష్‌వో మీ ఇంటికొచ్చి తెలుస్తారా!”
రమేష్ ముఖం పాలిపోయినట్టయింది.
బుకాయించి లాభం లేదనుకున్నాడు. ఇంతసేపు తమాషా చేసినట్టు నవ్వేసి, ”బాగున్నావా, బాబాయ్” అన్నాడు.
”ఇదేం అవతారం! మెడికల్ కాలేజీలో వుండాల్సిన వాడివి ఇక్కడెందుకున్నావ్!?”
”అవతారం ఏం కాదు. మా చదువులో ఇదొక భాగం. మాకు ప్రాక్టికల్స్ వుంటాయి”
”ఈ బాబాయిని మరీ అంత చవట కింద జమ కట్టకు. అయిదేళ్ళ తరువాత కదా హౌస్ సర్జన్. మెడిసిన్లో చేరి రెండేళ్ళే అయింది…”
”నేను సాయంత్రం మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను బాబాయ్. ఇక్కడ పేషంట్లున్నారు…”
సాయంత్రం బర్కత్‌పురాలో వుంటున్న శంకర్రావు ఇంటికి వెళ్ళాడు రమేష్. ముందు రూంలోనే ఆయన భార్య కమలమ్మ చేటలో పప్పులేవో పోసుకుని బాగు చేస్తోంది. ”బాగున్నావా, రమేష్?” నవ్వుతూ పలకరించింది ఆమె.
”బాగున్నాను పిన్నీ! మీ ఆరోగ్యం ఎలా వుంది”
”షుగర్ వచ్చిందిరా ఈ మధ్యనే ! ఏం చేస్తాం? బీపీలు, షుగర్లు సర్వ సాధారణం అయిపోయాయి కదా ఈ రోజుల్లో?…అమ్మ ఎలా వుంది?”
”బాగుంది పిన్నీ”
”మొత్తానికి డాక్టరు అవుతున్నావు. మీ నాన్న కల నెరవేరుస్తున్నావు. మన కుటుంబంలో డాక్టర్లు ఎవరూ లేరు. నువ్వు ఆ లోటు తీరుస్తున్నందుకు సంతోషంగా వుందిరా!”
”ఆ… డాక్టరు అవుతున్నాడు… అవుతూ…న్నా…డు…” వక్రంగా నవ్వి ఏదో అనబోయాడు శంకర్రావు.
చటుక్కున అతడి చెయ్యి పట్టుకుని ”మనం కొంచెం బయటికెళ్ళి మాట్లాడుకుందాం రా బాబాయ్” అన్నాడు రమేష్ అతడిని పైకి లేపుతూ.
కాలనీ పార్క్ దగ్గరలోనే వుంది. వెళ్ళి సిమెంట్ బెంచీ మీద కూర్చున్నారు ఇద్దరు.
”మెడిసిన్‌లో నాకు రెండోసారి కూడా సీటు రాలేదు బాబాయ్. మెరిట్ మార్కులు వచ్చినా ఒక్క మార్కుతో సీటు తప్పి పోయింది. ఈసారి కూడా సీటు రాలేదని తెలిస్తే నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నాన్న కుప్ప కూలిపోతాడనిపించి అబద్దం ఆడాల్సి వచ్చింది. నా అబద్దం బయట పడకూడదన్న ఉద్దేశంతో కాలేజీకి వెడుతున్నానని చెప్పి హాస్పిటల్‌కి వెడుతున్నాను. వైద్య వృత్తి చిన్నప్పటి నుండి నా కల! డాక్టరుగా కాకపోయినా కాంపౌండరుగానైనా కోరిక తీరుతుందని ఇక్కడ చేరాను. థర్డ్ టైం కూడా పరీక్ష రాశాను. సీటు వస్తే ఈ దొంగ బతుకు ధైర్యంగా చాలించ వచ్చని, రాలేదు! సమయం చూసి నాన్నకు నిజం చెబుదామనుకున్నాను గాని నీతి నిజాయితి అంటూ విలువలు బోధించి పెంచిన కొడుకులో ఇటువంటి నేరపూరితమైన, దుర్మార్గమైన ఆలోచన వచ్చిందని తెలిస్తే అస్సలు తట్టుకోలేరనుకుని నిజం చెప్పాలనుకుని చెప్పలేకపోయాను” దీర్ఘంగా నిట్టూర్చాడు రమేష్.
”ఈ నిజం ఇంట్లో, బయట తెలిస్తే నాకు ఆత్మహత్య చేసుకోవడం కంటే మరో దారి లేదు బాబాయ్! దయచేసి ఈ సంగతి నీ గుండెలోనే దాచుకో! ఎక్కడా చెప్పనని నాకు మాటివ్వు!” చేతిని ముందుకు చాచాడు.
”నేను మాటిచ్చినంత మాత్రాన నీ కొచ్చే లాభమేమీ ఉండదు. నిజం గుడ్డలో కట్టిన నిప్పులాంటిది. ఎన్నాళ్ళో దాగేది కాదు. ఏదో ఒక సందర్భం చూసి కుండబద్దలు కొట్టడం మంచిది. ఒక అబద్ధాన్ని మోసుకుంటూ తిరగడం నీకూ మంచిది కాదు”
బాబాయ్ మాట తీసేయవలసింది కాదు అనుకున్నాడు. కానీ ఇప్పుడు నిజం కక్కడం కూడా కష్టమే. తండ్రి ఆరోగ్యం అంతంత మాత్రంగానే వుంది. ఈ మధ్య తరుచూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాడు. కొద్ది రోజులు ఓపిక పడితే కొడుకు యంబిబిఎస్ పూర్తి అయ్యి చేతికొస్తాడని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయన్న ధీమా, సంభాషణల్లో తరుచూ వ్యక్తం చేస్తున్న తండ్రి ముందు తన నాటకాన్ని ఎలా బట్టబయలు చేయాలో తోచని స్థితిలో పడ్డాడు. మింగలేక కక్కలేక అన్నట్టుగా వుంది పరిస్థితి.
అందరూ కాబోయే డాక్టరని మన్ననగా చూస్తున్నారు. దాన్ని వదులు కోవడానికి మనసొప్పడం లేదు! తను మెడిసిన్ చదవడం లేదని బయటపడితే, ఒక్కసారిగా కైలాసపటంలో పెద్దపాము నోట్లో పడ్డట్టుగా అవుతుంది. కీర్తి వ్యామోహం కూడా అతడిని వెనుకకు లాగసాగింది. బాబాయ్ అన్నట్టుగా గుడ్డలో కట్టిన నిప్పులా నిజం తనకు తానుగా బయట పడక ముందే తానే చెబితే కొంచెం సిగ్గు దక్కుతుందని ఒకటి రెండు సార్లు సన్నద్దమయ్యాడు. కాని నాన్నకు చెప్పడానికి ధైర్యం చాలడంలేదు. ముందు ఆయనకు చెప్పకుండా అమ్మకి చెప్పి సమయం చూసి నాన్నకు చెప్పమని చెబితే సరి అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే చెల్లెలికి పెళ్ళి సంబంధం వచ్చింది. ఈ సమయంలో తను మెడిసిన్ చదవడం లేదని తెలిస్తే బంగారం లాంటి సంబంధం తప్పిపోయే ప్రమాదం కనిపించింది. చాలాసార్లు చెబుదామనుకుని చెప్పలేని పరిస్థితులు వచ్చాయి. చూస్తూండగానే అయిదేళ్ళు పూర్తి కావచ్చాయి. డాక్టరు బోర్డు పెట్టకముందే సంబంధాలు క్యూ కట్టాయి. హైక్లాస్ సొసైటీకి చెందిన వాళ్ళు అతడిని అల్లుడిని చేసుకోవాలని పోటీ పడసాగారు. డాక్టర్ డాక్టర్ అంటూ తను పాపులర్ కాకపోతే వీళ్ళెవరూ తమ కుటుంబం వైపు కన్నెత్తి కూడా చూసేవాళ్ళు కాదు.
సంపన్నుల సంబంధాలు రావడం చూసి తన అంతస్తు ఒక్కసారిగా పెరిగి పోయినట్టుగా సంబరపడి పోతున్న నాన్నను ఎలా పాతాళంలోకి తోసేయాలో తెలియడం లేదు. ఒక విధంగా అది ఆయన్ని మృత్యు ముఖంలోకి విసిరేసినట్టే! అప్పుడు జరిగే అనర్ధం కళ్ళకు కట్టినట్టు అవుతుంటే నిజం గుండెలోనే దాచుకోక తప్పలేదు.
పెద్దింటి సంబంధం కుదిరి పెళ్ళి కావడంతో పాటు, డాక్టరుగా బోర్డు కూడా పెట్టేశాడు. డాక్టర్ రమేష్ ఎంబిబిఎస్, ఉస్మానియా యూనివర్సిటీ అని! తనెవరో తెలియని కొత్త కాలనీలో ప్రాక్టీస్ పెట్టాడు. గర్వంగా, సంతృప్తిగా చూసుకున్న తండ్రి ఒకరోజు హఠాత్తుగా హార్ట్‌ఎటాక్‌తో పోయాడు.
చదువుకోడానికి కాలేజీకి వెడుతున్నాని ఇంట్లో చెప్పి వెళ్ళి పేరు ప్రఖ్యాతులున్న హాస్పిటల్స్‌లో కాంపౌండరుగా పని చెయ్యడం వల్ల వైద్యం పట్ల కావలసినంత అవగాహన కలిగి డాక్టరుగా చెలామణి కావడానికి చక్కగా దోహదపడింది. నకిలీ డాక్టరు అయినా గట్టి డాక్టరుగానే నిలబడ్డాడు.
హస్తవాసి వున్న డాక్టరుగా మంచి పేరు రావడంతో కార్లూ, మేడలూ రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. బీద వాళ్ళ దగ్గర ఫీజు తీసుకునే వాడు కాదు. వాళ్ళకు మందులు కూడా తానే ఇచ్చేవాడు. ఈ టెస్టులని ఆ టెస్టులని రాసి, వాళ్ళతో అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టించేవాడు కాదు. రోగి లక్షణాలను బట్టి రోగ నిర్ధారణ చేసి మందులు రాసేవాడు. అవి గురి చూసి కొట్టిన బాణంలా తగిలేవి. ఆ కాలనీలో అందరి అభిమానాన్ని కావలసినంత కొద్ది కాలంలోనే సంపాదించుకున్నాడు.
***
ఈ అవసరం వుంది ఆ అవసరం వుంది అంటూ రమేష్ దగ్గర డబ్బు పట్టుకెళ్ళే శంకర్రావు రాను రాను ఎక్కువ మొత్తంలో డబ్బు గుంజడం మొదలు పెట్టాడు. రమేష్ కాంపౌండరుగా వున్నప్పుడే మొదలైంది డబ్బు గుంజడం. ఒకసారి ఏకంగా పదిలక్షలు అడిగాడు.
”మనోజ పెళ్ళి కుదిరిందిరా. ఎన్నారై సంబంధం.. నువ్వున్నావన్న ధైర్యంతో వరకట్నంగా పదిలక్షలు ఒప్పుకున్నాను”
తెల్లబోయాడు రమేష్. ”పదిలక్షలా? పదివేలన్నట్టుగా అడుగుతున్నావు, బాబాయ్ అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది?”
శంకర్రావు ముఖమంతా ఎలాగో పెట్టుకున్నాడు. ”నీ దగ్గర దొరుకుతుందన్న ధైర్యంతోటి పది లక్షలు ఒప్పుకుని సంబంధం కుదుర్చుకున్నానురా. నువ్వు ఇవ్వకపోతే నలుగురిలో నవ్వుల పాలవుతాను.”
”ముందు నన్నొక మాట అడగకుండా ఏ ధీమాతో ఒప్పుకున్నావు అంత కట్నం? ఇపుడు గొంతు మీద కత్తి పెట్టినట్టుగా అడిగితే నేనెక్కడ నుండి తేను? నా దగ్గర లేవు, బాబాయ్! వేరే దారి చూసుకో”
”కష్టపడి చదివి ఎంబిబిఎస్‌లు, ఎండీలు చేసిన వాళ్ళకు తీసిపోకుండా నకిలీ సర్టిఫికెట్ పెట్టుకుని సంపాదిస్తున్నావు. నీ దగ్గర డబ్బు లేదంటే నమ్ముతాననుకున్నావురా? అప్పు తెచ్చిస్తావో, బ్యాంకు నుండి డ్రా చేసి తెచ్చిస్తావో నీ ఇష్టం! వారం రోజుల్లో డబ్బు నా చేతుల్లో పడాలి”
”డబ్బు ఇవ్వకపోతే…”
”దుకాణం మూసుకుని కటకటాల వెనక్కి పోవాల్సి వస్తుంది. ఈ ఐశ్వర్యం, ఈ వైభవం ఇదంతా నా దయవల్లేనని మరువకు. నీ రహస్యాన్ని కోహినూర్ వజ్రంలా కాపాడుకుంటూ వస్తున్నాను కాబట్టి నువ్వు ఒక వెలుగు వెలుగుతున్నావు! నోరు విప్పానంటే నీ బతుకు ఏమౌతుందో ఆలోచించు!” బ్యాగులోంచి ఈనాడు దినపత్రిక తీసి చదవాల్సిన మ్యాటరు కళ్ళ ముందుంచాడు, ఒక విషపు నవ్వునవ్వుతూ.
”శంకర్ దాదాల ఆట కట్టు! వైద్యబృందం హైదరాబాద్‌లో జల్లడ పట్టి యాభై మంది నకిలీ డాక్టర్లను గుర్తించి జైలుకు తరలింపు…”
”రేపు నీ పేరూ వస్తుంది పత్రికలో… నకిలీ డాక్టర్ పట్టి వేత. డాక్టరు అవతారం ఎత్తిన కాంపౌండరు. జైలుకు తరలింపు అన్న వార్త చూడాల్సి వస్తుంది”
రమేష్ దవడలు బిగుసుకు పోయినట్టుగా అయ్యాయి. సీరియస్‌గా ”రేపురా బాబాయ్!” అన్నాడు.
”అలారా దారికి” విజయ గర్వం తాండవించింది శంకర్రావు ముఖంలో.
”పది లక్షలు మొత్తం క్యాషే ఇవ్వాలి రా! చెక్కివ్వడమో, నా అకౌంట్‌కు ట్రాన్సఫర్ చేయడమో వద్దు”
”నా రహస్యం ఏనాడైతే నీ చేతిలో పడిందో అప్పటి నుండి నన్ను బంగారు గుడ్లు పెట్టే బాతుగా మల్చుకున్నావు కద బాబాయ్! చివరికి ఆ కథలో ఆ బంగారు బాతు ఏమైందో నీకు తెలిసే వుంటుంది! దురాశ దుఃఖానికి చేటు అనే నీతి పాఠం చెప్పే ఆ కథలా చేసుకుంటున్నావు”
”ఆ డబ్బు నీకు మళ్ళీ ఇచ్చేస్తాలే రా. పిల్ల పెళ్ళయిపోయి కాస్త కాళ్ళు చేతులు కూడదీసుకోగానే నీ డబ్బు అంచెలంచెలుగా ఇచ్చేస్తాను”
”నా దగ్గర డబ్బు తీసుకున్న ప్రతిసారీ ఇదే మాట అంటావు. కాని ఒక్కసారీ తిరిగి ఇచ్చిన పాపాన పోలేదు”
”ఈ సారి మాత్రం తప్పక ఇస్తాను. మాట నిలబెట్టుకుంటానో లేదో నువ్వే చూస్తావుగా”
మరునాడు డబ్బు తీసుకుపోవడానికి కొత్త లెదర్‌బాగ్ కొని తెచ్చుకున్నాడు శంకర్రావు. పది లక్షల డబ్బు పాతబ్యాగులో ఎందుకని.
”డబ్బు రెడీ చేశావా లేదా?” ఆత్రం పట్టలేనట్టుగా అడిగాడు.
అతడికి జవాబేమీ ఇవ్వకుండా ఎవరి కోసమో చూస్తున్నట్టుగా వాచీలోకి చూసుకున్నాడు రమేష్. అంతలో జీపు హారన్ వినిపించింది. రమేష్‌తో పాటు శంకర్రావు కూడా తొంగి చూసాడు. హాస్పిటల్ ముందు ఆగిన జీపు నుండి దిగిన పోలీస్ ఇన్‌స్పెక్టర్, అతడితో పాటు దిగిన కానిస్టేబుల్స్ బూట్లు టకటక లాడించుకుంటూ లోపలికి రావడం కనబడింది. శంకర్రావు గాటరా పడిపోయాడు.
”పోలీసులెందుకొస్తున్నారు?”
”నిన్న నువ్వన్న మాట నిజం చెయ్యడానికి!”
”నేనే మన్నాను?”
”నకిలీ డాక్టర్ ఆట కట్టు అంటూ బెదిరించావు కదా?”
”అదేమిటి రా! నువ్వు నకిలీ డాక్టర్ వన్న విషయం వాళ్ళకెలా తెలిసింది? నేనైతే చెప్పలేదు. ఒట్టు”
”నువ్వెందుకు చెబుతావు? బంగారు గుడ్లు పెట్టే బాతును నీ చేతులతో చంపుకునే తెలివి తక్కువ వాడివి కాదు కదా? పోలీసులకు నేనే ఫోన్ చేసి చెప్పాను”
”ఎందుకురా ఇంత పిచ్చి పని చేశావు?”
”పిచ్చి పని కాదు. ఇదే సరైన పని. ఎప్పుడో చేయాల్సిన పని! ఆలస్యంగానైనా చేస్తున్నందుకు నన్ను నేను అభినందించుకుంటున్నాను. నాకు మెడికల్ కాలేజీలో సీటు రాలేదని తెలిస్తే నాన్న కుప్ప కూలిపోతాడని ఏనాడైతే అబద్దమాడానో ఆ క్షణం నుండి నేను మానసిక శాంతిని కోల్పోయాను. బాబాయ్! నాన్నను సంతోష పెట్టడానికి, ఆయన ప్రాణం నిలబెట్టడానికి అబద్దమాడినప్పటి నుండి సంఘర్షణ! అశాంతి! అది పూర్తిగా నాన్న మీదనే తోయడానికి లేదు, నాకు తెల్లకోటు మీద వున్న వ్యామోహం కూడా ఈ నేరం చేయడానికి దోహదపడింది. కానీ, ఈ దొంగ ముసుగులో ఏనాడూ సంతోషంగా లేను. ప్రతీక్షణం తప్పుచేస్తున్నానన్న ఫీలింగ్! కాని అంత అశాంతిలోను ఒకటి తృప్తి. నేను ఎంబిబిఎస్ చదవకపోయినా అయిదేళ్ళు అనుభవజ్ఞుల చేతికింద పని చేసిన అనుభవంతో రోగులకు మంచి వైద్యమే అందించాను. చిన్నచిన్న సమస్యలకు స్కానింగులని, ఎక్సరేలని రోగులను ముప్పు తిప్పలు పెట్టకుండా రోగి లక్షణాలను బట్టి వైద్యం చేశాను. అవి తగ్గిపోయేవి. హస్తవాసి వున్న డాక్టరుగా పేషంట్ల అభిమానాన్ని చూరగొన్నాను. మందులు కొనలేని వాళ్ళకు మందులు నేనే ఇస్తూ వస్తున్నాను. ముఖ్యంగా బీదల డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాను. ఏం చేస్తేనేం… నా దొంగ బతుకు నన్ను నిలదీస్తూనే వుంది. రాత్రి పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి నా నిజస్వరూపం వెల్లడించిన తరువాత అంతులేని ప్రశాంతి నన్నా వరించింది! ఇన్ని సంవత్సరాల తరువాత గుండెల మీద చెయ్యేసుకుని రాత్రి సుఖంగా నిద్రపోయాను”
నవనాడులూ కుంగి పోయినట్టుగా చూస్తున్నాడు శంకర్రావు.
”హఠాత్తుగా క్లినిక్ మూత పడితే నా చేతి కింద పనిచేసే వర్కర్లు, నర్సులు, కాంపౌండర్లు రోడ్డున పడకుండా వాళ్ళకు తగు ఏర్పాట్లు చేశాను. రాత్రి నా భార్యాపిల్లలను కూడా కూర్చోబెట్టి అంతా చెప్పాను. వాళ్ళకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేశాను. ఇహ నిశ్చింతగా కటకటాల వెనక్కి పోయి కూర్చుంటాను”
అప్పటికే శంకర్రావు ముఖం మాడిపోయింది.
”మరి నా సంగతి ఏం చేశావు? నిన్ను నమ్ముకుని నా పిల్లకు సంబంధం కుదుర్చుకున్నాను” అన్నాడు నీరసంగా.
”నీ సంగతి ఏముంది? అధోగతే. నా తప్పును ఆసరాగా చేసుకుని వేలూ లక్షలు సంపాదించావు! ఒక విధంగా నన్ను జలగలా పట్టుకుని నా రక్తం పీలుస్తూ బతికావు”
”అందరికీ అన్ని ఏర్పాట్లు చేశానన్నావు. నాకూ ఏదో ఏర్పాటు చేసి పోవాలి కదరా! పైగా అది నీ చెల్లెలు… నీ చెల్లెలి పెళ్ళి ఆగిపోవడం నీకు మంచిదా?” ఇన్‌స్పెక్టర్ సమీపించాడు.
”రండి ఇన్‌స్పెక్టర్! మీతో రావడానికి నేను రెడీగా వున్నాను” రమేష్ కుర్చీ లోంచి లేచాడు వెళ్ళడానికి సిద్ధమై.
***
రమేష్ కస్టడీలో వుండగానే పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నట్టుగా కాలనీ వాళ్ళంతా వచ్చి స్టేషన్ ముందు నిలబడి నినాదాలు చేశారు… మా డాక్టర్‌ను వదిలి పెట్టండి అంటూ.
”డాక్టరు గారు మా దేవుడు. ఏ రాత్రి ఏ పగలైనా, ఏ ఆపద వచ్చినా ఆయన వున్నారని మాకు ధైర్యంగా వుండేది. ఆయన్ని వదిలి పెట్టండి” అంటూ నినాదాలు చేశారు. ఇన్‌స్పెక్టర్ బయటికి వచ్చి చెప్పాడు… ”అతడు డాక్టర్ కాదు. నకిలీ డాక్టర్‌నని తానే ఒప్పుకున్నాడు. అతడి దగ్గర ఇంటర్ మీడియట్ చదివిన సర్టిఫికెట్ తప్ప ఇంకే సర్టిఫికెట్ లేదు. అలాంటి వాడు వైద్యం చేస్తే రోగుల ప్రాణాలతో చెలగాటమాడినట్టే. అతడిని నమ్మి అతడి చేతిలో మీ ప్రాణాలు పెడితే గోవింద కొట్టినట్టే. ఇప్పటికైనా అతడి బండారం బయట పడినందుకు సంతోషించండి”
”చాలామంది పెద్ద పెద్ద డాక్టర్ల కంటే ఈ సారు శానా నయం. ఏదో తెలియని రోగమొచ్చి పెద్ద పెద్ద డాక్టర్లందరూ బతకడని ఆశ వదిలేసుకొమ్మని చెప్పిన మా ఆయన్ని బతికించిన దేవుడాయన!”
”ఏ రాత్రి ఏ పగలు ఏ ఆపద వచ్చినా ఫోన్ చేస్తే చాలు పరిగెత్తుకు వచ్చి ధైర్యం చెప్పే మహానుభావుడాయన….” ఒకొక్కరు ముందుకు వచ్చి రమేష్‌ను కీర్తిస్తుంటే తలపట్టుకున్నాడు ఇన్‌స్పెక్టర్.
”అతడి మీద ఎఫ్‌ఐఆర్ రాయడమైపోయింది. రేపు కోర్టులో హాజరు పరుస్తున్నాం. మీరేమైనా చెప్పుకోవాలనుకుంటే కోర్టులో చెప్పుకోండి జడ్జి గారి ముందు”
కాని రమేష్ బెయిల్‌కు కూడా ప్రయత్నించ లేదు. ”తప్పు చేశాను. నాకు వేయాల్సిన శిక్ష వేయండి. అందులోనే నాకు మనశ్శాంతి” అన్నాడు.
ఆశ్చర్యపోయాడు జడ్జి, అతడి మనో నిబ్బరం చూసి.
‘వస్తుతః నేను చెడ్డ వాడిని కాదు. మా నాన్న గారు స్కూల్ టీచరు. స్కూల్లో పిల్లలకు చదువుతో పాటు నీతిపాఠాలు కూడా బోధించి వారిని సక్రమ మార్గంలో నడవడానికి దారి చూపిన వారు. ఇంట్లో తన పిల్లలను పెంచడంలో కూడా అదే నిబద్దత పాటించేవారు! అబద్దం ఆడితే సహించేవారు కాదు. వీపు విమానం మోత మోగి పోయేది. అలాంటిది ఇంత పెద్ద నేరపూరితమైన ఆలోచన నాలో రూపు దిద్దుకున్నదంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. పరిస్థితుల ప్రాబల్యం తప్ప మరొకటి కాదనుకుంటాను. తప్పు చేశానే గాని ఏనాడూ మనశ్శాంతిగా లేను. అనుక్షణం నలిగిపోతూనే వున్నాను. నాకు శిక్ష వేయండి జడ్జిగారూ! ఆ శిక్షే నాకు మనశ్శాంతి ప్రసాదిస్తుంది”
హాలంతా రణగొణ ధ్వనులతో నిండిపోగా ”సైలెన్స్”అని అరిచి చేతిలోకి కలం తీసుకున్నాడు జడ్జి.
పోల్కంపల్లి శాంతాదేవి