నవతెలంగాణ – శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా 2019లో కేంద్రం విభజించిన తర్వాత బుధవారం లడఖ్‌లో కీలక ఎన్నికలు జరిగాయి. కార్గిల్ జిల్లాలోని లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌లోని 26 స్థానాల కోసం 85 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సుమారు 77.61 శాతం ఓటింగ్ నమోదైంది. ఆదివారం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నికల సందర్భంగా ఓటరు గుర్తింపు కోల్పోయినట్లు చాలా మంది ఆరోపించారు. అలాగే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన లడఖ్‌లో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం లేదని వాపోయారు. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ నుంచి తమ ప్రాంతాన్ని విభజించిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం ప్రయోగం విఫలమైనందున తిరిగి జమ్ముకశ్మీర్‌లో కలపాలని మరికొందరు డిమాండ్ చేశారు. అలాగే జమ్ముకశ్మీర్ మొత్తానికి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని నినాదాలు చేశారు.