కొన్ని సినిమాలు ఎందుకు ప్రజలకు విపరీతంగా నచ్చుతాయో, ఆ సినిమాకు పని చేసిన కళాకారులకే అర్ధం కాదు. 1934 లో క్లార్క్ గాబెల్, క్లాడెట్ కోల్బర్ట్ నటించిన ‘ఇట్ హాపెండ్ వన్ నైట్’ సినిమా ఇప్పటికీ ప్రపంచ గొప్ప సినిమాలలో ఒకటిగా నిలిచే ఉంది. దీన్ని ప్రపంచంలో ఎన్నో భాషల్లోకి చాలాసార్లు రీమెక్ చేశారు. హిందీలో ‘చోరీ చోరీ, నౌ దో గ్యార దిల్ హై కీ మాన్తా నహీ’ సినిమాలు ఈ సినిమాకు కాపీలే. ఇవి కాక రెండు తమిళ సినిమాలు, ఓ కన్నడ సినిమా, ఓ బెంగాలీ సినిమా కూడా ఈ సినిమా కథ ఆధారంగా మన దేశంలో నిర్మించారు. ఇంగ్లీషులో కూడా ఈ సినిమా కథ చాలాసార్లు తెరకెక్కింది. అన్నిసార్లూ, ఆ సినిమాలన్నీ కూడా గొప్ప హిట్లుగా నిలిచాయి.
ఈ సినిమాను నిర్మించిన కొలంబియా పిక్చర్స్ దీన్ని ఓ సాధారణ సినిమాగానే ఎంచి కనీసం సరిగ్గా అడ్వర్టైజ్ కూడా చేయకుండా అప్పట్లో బీ గ్రేడ్ థిóయేటర్లలో రిలీజ్ చెసింది. అనూహ్యంగా ఇది జనానికి విపరీతంగా నచ్చి అతి గొప్ప హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో నటించడానికి కోల్బర్ట్ అసలు ఇష్టపడలేదు. డబ్బు రెండింతలు వస్తుందని ఆమె అంగీకరించినా ఇదో చెత్త సినిమా అనే ఆమె భావించింది. అందుకని ఆస్కార్ అవార్డుకు ఆమెకు నామినేషన్ లభించిందని తెలిసినా కూడా ఆమె అవార్డు ఫంక్షన్‌కు రాలేదు. ఏదో ఊరు వెళ్ళే ప్రయత్నంలో ఉన్న ఆమెను స్టేషన్ నుండి పట్టుకొచ్చి అవార్డు అందించారు డైరక్టర్ ఫ్రాంక్ కాప్రా. ఈ సినిమాలో నటించిన వారంతా మరణించిన తరువాత కూడా కొన్నేళ్లు జీవించి ఉన్న కోల్బర్ట్ ఈ సినిమా ఆ తరువాత తరాలలో ఎన్నో సార్లు ప్రస్తావించబడడం, చూసి ఆశ్చర్యపోయారు. తాను కానీ, హీరో క్లార్క్ గాబెల్ కానీ ఈ సినిమాను ఇష్టంతో చేయకపోవడం గురించి ఆమె చాలా సందర్భాలలో చెప్పారు. 1992 లో 92 ఏళ్ళ వయసులో ఆమె మరణించేదాకా ఈ సినిమా ఇంత గొప్ప చిత్రంగా నిలిచి ఉండడం గురించి ఆశ్చర్యపోతూనే ఉన్నారట.
క్లార్క్ గాబెల్ ఆ రోజులో జొయాన్ క్రాఫోర్డ్‌తో రెలేషన్ షిప్‌లో ఉన్నారట. అది తప్పుగా భావించి, శిక్షగా అతన్ని కొలంబియా పిక్చర్స్‌కు లీజ్‌కి ఇచ్చింది ఎమ్. జీ. ఎం. సంస్థ. ప్రపంచ గొప్ప నటుల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్న క్లార్క్ గేబెల్ జీవితంలో ఒకే ఒక్క ఆస్కార్ గెలుచుకున్నారు. అదీ ఈ సినిమాకే. దర్శకులు ప్రాంక్ కాప్రా కూడా చాలా తొందరగా ముగించిన సినిమా ఇది. ఇదో క్లాసిక్‌గా నిలుస్తుందని ఎవరూ ఊహించను కూడా లేదు.
ఈ సినిమాలో ఓ కామెడీ సీన్ చేస్తూ తన చొక్కా, లోపలి బనీను కూడా విప్పాలి హీరో క్లార్క్ గాబెల్. కాని అతనికి ఈ రెండు ఇప్పడం కష్టమైంది. డైలాగ్ చెబుతూ ఈ రెండూ విప్పడంతో టైమింగ్ కుదరట్లేదు. అందుకని కొన్ని టేక్‌ల తరువాత దర్శకులు చొక్కా మాత్రమే ఇప్పమని చెప్పి సీన్ ముగించారు. అంటే లోపల బనీను లేకుండా క్లార్క్ గాబెల్ ఆ సీన్ లో కనిపిస్తారు. అదో గొప్ప ఫ్యాషన్ అనుకుని అప్పట్లో యువత బనీన్లు ధరించడం మానేసారు. దీనితో కొన్ని కంపెనీలు దివాలా తీసే పరిస్థితికి రావడంతో వారు కొలంబియా పిక్చర్స్‌పై కేసు వేసారట. అంత క్రేజ్ సంపాదించిన మొదటి అమెరికన్ సినిమా ‘ఇట్ హాపెండ్ వన్ నైట్’.
ఇదో రొమాంటిక్ కామెడీ అయినా, ఈ సినిమాతో స్క్రూ బాల్ కామెడీ అనే కొత్త రకం సినిమా మొదలయింది. అంటే అప్పటి సాంప్రదాయ ప్రేమ కథలకు భిన్నంగా ఆధిపత్యం చూపించే స్త్రీ ఆమె ముందు మోకరిల్లుతున్న స్థితిలో ప్రియుడిని ప్రేక్షకులు చూడడం మొదటి సారి. ఇలాంటి ప్రేమ కథలను స్క్రూ బాల్ కామెడీగా పరిగణించడం ఈ సినిమాతోనే మొదలయింది.
ఈ సినిమాకు నైట్ బస్ అనే ఓ చిన్న కథ ఆధారం. 1933లో శామ్యూల్ హాప్కిన్స్ ఆడమ్స్ రాసిన కథను సినిమాగా మలిచారు. స్టాలిన్ హిట్లర్ వంటి నియంతలు కూడా ఎంతో ఇష్టపడి చూసిన సినిమాగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. ఒకే సినిమాలో నటించిన కళాకారులు ఉత్తమ నటి, ఉత్తమ నటుడుగా ఆస్కార్ గెలుచుకున్న మొదటి సినిమా ఇదే. అలాగే ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకులు, ఉత్తమ స్క్రిన్ ప్లే కేటగిరీలలో ఆస్కార్ అందుకున్న ప్రధమ చిత్రం కూడా ఇదే.
ఎలెన్ ఆండ్రూస్ అందమైన అమ్మాయి. అలెగ్జాండర్ ఆండ్రూస్ అనే ఓ పెద్ద ధనవంతుడు ఆమె తండ్రి. డబ్బులో పెరగడం వలన మొండిగా తయారవుతుంది ఆమె. తండ్రి ఇష్టానికి విరుద్దంగా కింగ్ వెస్ట్లీ అనీ ఓ పైలట్‌ని ఆమె ప్రేమిస్తుంది. దొంగతనంగా అతన్ని పెళ్ళి చెసుకుంటుంది. వీరి వివాహానికి తండ్రి అంగీకరించడు. వెస్ట్లీ కేవలం డబ్బు కోసమే కూతురిని వలలో వెసుకున్నాడని తన జీవితానుభవంతో ఆండ్రూస్ గ్రహిస్తాడు. ఆ పెళ్ళిని చెల్లకుండా చేయాలని ఆయన ప్రయత్నిస్తాడు. కాని ఎంత చెప్పినా కూతురు ఆయన మాట వినదు. తండ్రి దగ్గర నుండి ఆమె పారిపోతుంది. తండ్రి తన మాట వినట్లేదని నావలో నుండి నీళ్ళలోకి దూకి పారిపోతుంది ఆమె. అంత మొండి కూతురిని ఎలా దారికి తేవాలో తెలియని ఆ తండ్రి తల పట్టుకుంటాడు.
ఎలెన్ బస్ ఎక్కి తన భర్తను చేరుకోవాలని రాత్రి ప్రయాణం పెట్టుకుంటుంది. ఆ బస్సులో పీటర్ అనే ఓ చిన్న రిపోర్టర్‌తో ఆమెకు పరిచయం అవుతుంది. ముందు అతన్ని ఆమె ద్వేషిస్తుంది. కాని తప్పని పరిస్థితులలో అతనితో ప్రయాణం చేయవలసి వస్తుంది. దారిలో ఆమె డబ్బు పోగొట్టుకుని పీటర్‌పై ఆధారపడవలసి వస్తుంది. పీటర్ ఎలెన్‌ను గుర్తు పడతాడు. ఆమె తండ్రి కూతురి కోసం అన్ని పత్రికలలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఆమె ఆచూకి చెప్పినవారికి బహుమతి ప్రకటిస్తాడు. తన పత్రికకు ఓ మంచి కథకు ఆమె ఉపయోగపడుతుందని ఆమెతో కలిసి ప్రయాణిస్తాడు పీటర్. తన ఉద్దేశం కూడా అమెకు చెబుతాడు. కాని ఈ ప్రయాణంలో ఇద్దరిలో ఒకరిపై మరొకరికి ఇష్టం పెరుగుతుంది.
బస్ పాడవడంతో ఇద్దరూ విడిగా ప్రయాణించవలసి వస్తుంది. ఓ రాత్రి అక్కడే ఓ హోటల్‌లో గడుపుతారు. పీటర్‌లోని మంచితనం, చలాకీతనం ఎలెన్‌ను ఆకర్షిస్తాయి. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన ఆమె ఆ రాత్రి సాధారణమైన జీవితాన్ని ఆస్వాదిస్తుంది. అందులోని సాధారణత్వాన్ని ఆమె ఇష్టపడుతుంది. ఏ భేషజాలు లేకుండా ఇతరులతో కలిసి జీవించడంలోని స్వేచ్ఛను ఆమె మొదటిసారి అనుభవిస్తుంది. జీవితంలో ప్రతిరోజునీ ఓ సవాలుగా తీసుకుని గడిపే పీటర్‌లోని నిజాయితీ ఆమెను ఆకట్టుకుంటుంది. అతనితో తన మనసులోని మాట బైటపెడుతుంది. పీటర్ ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. కాని అతని చేతిలో డబ్బు ఉండదు. అందుకని నిద్రపోతున్న ఎలెన్‌కు చెప్పకుండా తన ఎడిటర్ దగ్గరకు వెళ్ళి డబ్బు తెచ్చుకుంటాడు. కాని అతను వచ్చేలోపే ఎలెన్‌ను ఆ హోటల్ నుండి గెంటేస్తారు యజమానులు. డబ్బు కోసం పీటర్ తనను మోసం చేసాడనుకుంటుంది ఎలెన్. ఆమెను పట్టిస్తే డబ్బు ఇస్తానని ఆమె తండ్రి పేపర్ ప్రకటన ఇచ్చాడు కాబట్టి పీటర్ తన అచూకీ తండ్రికి చెప్పి డబ్బు సంపాదించుకునే ఆలోచన చేసి ఉంటాడని ఆమె ఊహిస్తుంది. ఇక తప్పక ఎలెన్ తండ్రికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లిపోతుంది.
కూతురి మొండితనం ముందు తలవంచి ఆండ్రూస్ ఆమె వివాహానికి అంగీకరిస్తాడు. చర్చ్‌లో మళ్లీ కూతురికి బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి జరిపించడానికి పూనుకుంటాడు. ఈ లోపు పీటర్, ఆండ్రూస్‌ని కలిసి ఆ రాత్రి ఎలెన్ కోసం తాను ఖర్చుపెట్టిన డబ్బును అడిగి తీసుకుంటాడు. తనను డబ్బు కోసం తండ్రికి పీటర్ పట్టి ఇవ్వడానికే తనతో స్నేహం చేసాడని ఎలెన్ భావిస్తుంది. అతన్ని అసహ్యించుకుంటుంది. ఆ పెళ్ళి ఆమెకు ఇష్టం ఉండదు. కాని తప్పని పరిస్థితులలో ఆ వివాహానికి తల వంచుతుంది. తండ్రికి మరోసారి తలనొప్పి కావడానికి ఆమె ఇష్టపడదు. అలాంటి సమయంలో పెళ్ళి దుస్తులతో ఉన్న ఎలెన్‌తో ఆమె తండ్రి పీటర్ మంచివాడని, డబ్బు పట్ల మోహం అతనిలో లేదని, అతన్ని వివాహం చేసుకుంటే ఆమె సుఖపడుతుందని, బైట ఓ కారు ఆమె కోసం సిద్దంగా ఉందని, ఆమె పారిపోయి పీటర్‌ని వివాహం చేసుకుంటే తాను సంతోషిస్తానని చెబుతాడు. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో పెళ్లిపందిరి నుంచి మరోసారి పారిపోతుంది ఎలెన్. వారిద్దరూ అంతక్రితం బస చేసిన చిన్న హోటల్‌లో వారి కొత్తజీవితం మొదలవుతుంది. కూతురు చివరకు ఓ మంచి వ్యక్తికి భార్య అయిందని ఆమె తండ్రి తప్తిగా నిట్టూరుస్తాడు.
ఈ సినిమా ప్రభావంతో అప్పట్లో బస్ ప్రయాణాలు పెరిగాయట. ఇందులో హీరోయిన్ లిఫ్ట్ అడిగే సీన్ కొన్ని వందల సినిమాలలో కాపీ అయింది. అప్పటిదాకా చిన్న సంస్థగా హాలీవుడ్‌లో కష్టపడుతున్న కొలంబియా పిక్చర్స్ ఈ సినిమాతో పెద్ద సంస్థలకు ధీటుగా నిలిచింది. క్లార్క్‌గాబెల్ ఈ సినిమాకు పొందిన ఆస్కార్‌ని ఓ పిల్లవాడికి ఇచ్చేశాడట. ఆయన మరణం తరువాత ఆ అవార్డుని తిరిగి ఇచ్చేసాడు ఆ యువకుడు. దీని తరువాత 1996 లో వేలంలో ప్రఖ్యాత దర్శకులు స్టీవెన్ స్పీల్ బర్గ్ దీన్ని కొని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్‌కి భద్రపరచమని ఇచ్చారట. అలనాటి తారల అవార్డులను వేలం వేస్తే అభిమానులు కోట్లు వెచ్చించి కొనుక్కునే సాంప్రదాయం హాలీవుడ్ ప్రపంచంలో మామూలే.
ఈ సినిమాతో క్లార్ గాబెల్ హాలీవుడ్‌లో ప్రముఖ స్థానానికి చేరుకున్నారు. ఆ తరువాత ఈయన్ని అభిమానులు కింగ్ ఆఫ్ హాలివుడ్ అని పిలివడం మొదలెట్టారు. ఈ రోజుకీ ఆయన్ని ఇదే పేరుతో సినీ జనం గుర్తు చేసుకుంటారు. ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని నెలలకే హెస్ కోడ్‌ని హాలీవుడ్ అమలు చెసింది. అందుకని ఇది చివరి ప్రీ కోడెడ్ సినిమాగానూ గుర్తించబడింది. అమెరికా జీవిన సంస్కతిలో ఈ సినిమా ఓ భాగం అయింది. ఈ రోజుకి కూడా దీన్ని యువతరం ఇష్టపడి చూస్తారు. ఎన్నో సందర్భాలలో ప్రస్తావిస్తారు కూడా. ప్రపంచంలోనే గొప్ప ప్రేమ కథా చిత్రాలలో భాషాభేదం లేకుండా సినీజనం ఇష్టపడి చూసే ‘ఇట్ హాపెండ్ వన్ నైట్’ ఆ తరువాత వచ్చిన ఎన్నో ప్రేమ కథా చిత్రాలకు ప్రేరణగా చరిత్రలో నిలిచిపోయింది.
అప్పటిదాకా ప్రేమలో పైచేయి తీసుకునే స్త్రీ పాత్రను చూడని జనానికి ఈ సినిమా గొప్ప ఆకర్షణగా నిలిచింది. ఓ డబ్బు ఉన్న మొండి అమ్మాయి, ఎవరినీ లెక్కచేయని తత్వం ఉన్న ఓ స్త్రీ, ప్రేమలో పడి తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే పురుషుడ్ని అందుకోవడం, అతనితో సమానంగా అన్నిట్లోనూ ధీటుగా నిలబడడం రొమాంటిక్ కామెడీలలో కొత్త అంశం. ఇలాంటి పాత్రలను విశేషంగా ప్రజలు ప్రేమిస్తారని నిరూపించిన చిత్రం కూడా ఇదే. దీని తరువాత ప్రేమ కథలలో నాయికల వ్యక్తిత్వాలు చాలా మార్పులకు గురయ్యాయన్నది నిజం.
– పి.జ్యోతి,
98853 84740