– 15 జిల్లాల్లోని 43 స్థానాలకు
– బరిలో 683 మంది అభ్యర్థులు
రాంచీ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రెండు విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో తొలి విడత బుధవారం జరగనున్నది. 15 జిల్లాల్లోని 43 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 683 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. అయితే మొదటి విడత ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా, రాజ్యసభ ఎంపీ మహువా మాంఝీ, మాజీ ముఖ్యమంత్రి మధు కోడా భార్య గీతా కోడా, మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్ ఇతర కీలక అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. 43 నియోజకవర్గాల్లో 17 సాధారణ సీట్లు, 20 షెడ్యూల్డ్ తెగలకు, ఆరు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వు చేశారు. బుధవారం పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో అత్యధికంగా ఆరు స్థానాలు ఉన్నాయి. పాలము, పశ్చిమ సింగ్‌భూమ్, రాంచీ జిల్లాల్లో ఐదు సీట్లు ఉండగా, కోడెర్మా, రామ్‌గఢ్ జిల్లాల్లో ఒక్కో సీటు ఉంది. తొలి విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది.