నవతెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట నుండి సికింద్రాబాద్‌కు వెళ్లవలసిన ప్రయాణికులకు విజ్ఞప్తి.. మరికాసేపట్లో రైలు పట్టాల మీదకు రానున్నది అంటూ సిద్దిపేట రైల్వే స్టేషన్‌లో చారిత్రాత్మక సందర్భం ఆవిష్కృతం కానున్నది. దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న సిద్దిపేట ప్రాంత ప్రజల ఆకాంక్ష మంగళవారం సాయంత్రం 3గంటలకు కార్యరూపం దాల్చనున్నది. కేవలం 60 రూపాయలకే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రైలు ప్రయాణం చేయబోయే ఘడియ రానేవచ్చింది. మంత్రి హరీశ్ రావు జండా ఊపి రైలు ప్రారంభించనున్నారు.
దక్షిణ మధ్య రైల్వేపటంపై సిద్దిపేట రైలు పట్టాలు…
దక్షిణ మధ్య రైల్వే పటంపై సిద్దిపేట పేరు చేరింది. నిన్నటిదాకా రైలు ఎక్కాలంటే సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్ లేదంటే కరీంనగర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ నేటి నుండి సిద్దిపేటలోనే రైలెక్కి ప్రయాణం చేసే మహాభాగ్యం మంత్రి హరీశ్‌రావు చొరవతో కలిగింది. కొత్త రైల్వే లైను కావడంతో తొలుత డీజిల్‌తో నడిచే రైళ్లను ఈ రూట్‌లో అనుమతించారు. మరికొద్ది రోజుల్లోనే ఎలక్ర్టిక్ లైను అందుబాటులోకి రానున్నది. దీని ద్వారా రైలు వేగపరిమితి పెరుగుతుంది. ప్రస్తుతం 3గంటల్లో సికింద్రాబాద్‌కు రైలు ప్రయాణం ఉండగా, తర్వాతి రోజుల్లో కేవలం గంటన్నరలోనే సాఫీగా ప్రయాణం సాగుతుంది. ఇప్పటికే సిద్దిపేట రైల్వే స్టేషన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నినాదాలు నిజమయ్యాయి… గొప్ప సంతృప్తి..
– మంత్రి హరీశ్‌రావు
పాలనాపరమైన వికేంద్రీకరణలో సిద్దిపేట నూతన జిల్లాగా ఆవిర్భవించింది. వ్యవసాయాన్ని పండగ చేసేందుకు సిద్దిపేట గడ్డ గోదావరి నది బిడ్డగా మారింది. నేడు దక్షిణ మధ్య రైల్వేలో సిద్దిపేటకు చోటు దక్కింది. ఈ మూడు నినాదాలను నిజం చేయడం వెనుక తెలంగాణ సాకారంతోపాటు , ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండడం వల్లే సాధ్యమైంది. దశాబ్దాల కాలంగా ఎన్నికల హామీలుగా ఉన్న ఈ మూడు కలలను నెరవేర్చడంలో భాగస్వామినైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను.