జూన్‌ 8,9,10 తేదీల్లో ఫిష్‌ఫుడ్‌ ఫెస్టివల్‌

– మంత్రి తలసాని వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు జూన్‌ 8,9,10 తేదీల్లో ఫిష్‌ పుడ్‌ ఫెస్టివల్‌ ను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. బుధవారం బీఆర్‌. అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మృగశిర కార్తెను పురస్కరించుకుని ‘ఫిష్‌ఫుడ్‌ ఫెస్టివల్‌’ నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ ఆధర్‌ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్యా ఉన్నారు. ఈ సందర్భంగా మత్స్య సహకార సంఘాల సొసైటీ చైర్మెన్‌గా నియమితులైన పిట్టల రవీందర్‌ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన్ను శాలువాతో సత్కరించారు. శుభాకాంక్షలు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపధ్యంలో జూన్‌ 2 వ తేదీ నుంచి 21 రోజులపాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ఆదేశించారని వివరించారు. చేపలతో తయారు చేసిన ఫిష్‌ ప్రై, కర్రీ, బిర్యానీ వంటి అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వయం ఉపాధి పొందేలా అన్ని జిల్లాలకు చెందిన మహిళా మత్స్యకారులకు చేపలతో వివిధ రకాల వంటకాల తయారీపై ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర పండుగను తలపించే విధంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ అధికారులతోపాటు గోపాలమిత్రలకు కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. నూతనంగా లక్ష మందికి మత్స్య సొసైటీలలో సభ్యత్వాలు కల్పించే విధంగా స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తున్న విషయాన్ని కూడా మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలోని మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన వివరించారు.

Spread the love