అమెరికా డొల్లను వెల్లడించిన ఫిచ్‌!

 Fitch revealed the American dollar!ప్రపంచ రేటింగ్‌ సంస్థలలో ఒకటైన ఫిచ్‌ వికృత చర్యకు పాల్పడినట్లు జో బైడెన్‌ సర్కార్‌ మండిపడింది. అమెరికా ప్రభుత్వ రుణ పరపతి రేటింగ్‌ను ఎఎఎ స్థాయి నుంచి ఎఎ ప్లస్‌కు తగ్గిస్తూ మంగళవారం నాడు ఫిచ్‌ చేసిన ప్రకటనతో బుధ, గురువారాల్లో ప్రపంచ స్టాక్‌ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడింది. అనేక సూచీలు దిగజారాయి, అన్నింటికీ మించి అమెరికా పరువు గంగలో కలిసింది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షానికి ఒక ప్రచార అస్త్రం దొరికింది. అందుకే బైడెన్‌ సర్కార్‌ చిందులు తొక్కింది. ఫిచ్‌ సంస్థ లోపాలతో కూడిన పద్ధతిలో లెక్కించిందని, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని, దాంతో తాము ఏకీభవించటం లేదని ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే అమెరికా విత్త మంత్రి జానెట్‌ ఎలెన్‌ ఆగ్రహం ప్రకటించింది. గడచిన రెండు దశాబ్దాలలో పాలనా ప్రమాణాలు క్రమంగా దిగజారు తున్నాయని, ప్రభుత్వ రుణ పరిమితి గురించి రాజకీయ ప్రతిష్ఠంభనలు, చివరి నిమిషాల్లో పరిష్కారాలతో ఆర్ధిక యాజమాన్యంపై విశ్వాసం పోతోందని ఫిచ్‌ ప్రకటించింది. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన 1776 నుంచి 1917 వరకు వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వం చట్టం చేసి రుణబాండ్ల ద్వారా అప్పు తీసుకొనేవారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత 1917లో ఒక చట్టం చేసి రుణపరిమితి విధించారు. దాన్ని సవరిం చాలంటే పార్లమెంటు అనుమతి తీసుకోవాలన్న నిబంధన చేర్చారు. తరువాత 1939లో దాన్ని మరింత పటిష్టం గావించారు. దాంతో 1941 నుంచి 2023 వరకు వాద, ప్రతివాదాలు, అదిరింపులు బెదిరింపులతో తొంభైసార్లకు పైగా పార్లమెంటు అనుమతితో రుణపరిమితిని పెంచారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు లేదా తాము కోరిన విధంగా తెచ్చిన రుణాలను ఖర్చు చేసేందుకు అవసరమైన ఒత్తిడి, ఇతర రాజకీయ కారణాలతో ప్రతిపక్షంలో ఎవరు ఉన్నా ఆమోదం తెలపకుండా ఇరుకున పెట్టటం, చివరిక్షణం వరకు ఉత్కంఠకు దారితీసేట్లు చూసి పంతం నెగ్గించు కోవటం జరుగుతోంది. గడువు లోగా రుణ పరిమితి పెంచకపోతే ప్రభుత్వ రుణ కిస్తీలను చెల్లించలేక దివాలా తీసినట్లు ప్రకటించాల్సిన పరిస్థితి వస్తోంది. అధికారంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరున్నా అదే జరుగుతోంది.1995లో బడ్జెట్‌ ఆమోదం పొందకపోవటంతో మూడు దఫాలుగా 21 రోజులు ప్రభుత్వం పని చేయలేదు.
ఈ ఏడాది కూడా రుణ పరిమితి మీద చివరి వరకు తేల్చకుండా ఎట్టకేలకు పెంచేందుకు ప్రతిపక్ష రిపబ్లికన్లు అంగీకరించ టంతో బైడెన్‌ సర్కార్‌ గట్టెక్కింది. గతంలో 2011లో అమెరికా ప్రభుత్వ పరపతిని తగ్గిస్తూ స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ అనే రేటింగ్‌ సంస్థ చేసిన ప్రకటనతో ఇప్పటి మాదిరే సంచలనం చెలరేగింది. రేటింగ్స్‌ తగ్గించిన కారణంగా అధిక వడ్డీలతో ప్రభుత్వం రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకు రిపబ్లికన్‌ పార్టీ, దాని తరఫున తిరిగి బరిలోకి దిగాలని చూస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ హస్తం ఫిచ్‌ ప్రకటన వెనుక ఉందని అధ్యక్ష భవన మీడియా అధికారి కరీనే జీన్‌ పెరీ, బైడెన్‌ ఎన్నికల ప్రచార కమిటీ ప్రతినిధి కెవిన్‌ మునోజ్‌ ఆరోపించారంటే వాటిని తేలికగా తీసుకోలేము. గొర్రెల గోత్రాలు కాపరులకు ఎరుక అన్నట్లుగా రేటింగ్‌ సంస్థల లోగుట్టు గురించి డెమోక్రటిక్‌ పార్టీ వారికి తెలియకుండా ఉండదు. అవి ప్రభుత్వాలనే గడగడలాడించగలవు. ఇప్పుడు జరిగింది అదా కాదా అన్నది పక్కన పెడితే ఫిచ్‌ చెప్పిన కారణాలు వాస్తవమైనవే అనటం నిస్సందేహం. అంకెలతో ఎలా అయినా ఆడుకోవచ్చు. ప్రభుత్వం రుణ కిస్తీలు చెల్లించ లేక చేతులెత్తేసింది అనిపించేందుకు రుణ పరిమితి పెంపు దలకు అంగీకరించవద్దని రిపబ్లికన్‌ పార్టీ ఎంపీలను డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రోత్సహించినట్లు మునోజ్‌ విమర్శించాడు. మాంద్యం అని భయపెట్టారు తిరిగి కోలుకున్నది రేటింగ్‌ సంస్థకు కనపడలేదా అని డెమోక్రాట్లు రచ్చరచ్చ చేస్తున్నారు.
అమెరికా ప్రభుత్వ రుణం తీరుతెన్నుల రేటింగ్‌ తగ్గించిన తరువాత మిగతా ధనిక దేశాల్లోనే కాదు, వర్దమాన, పేద దేశాల్లో కూడ దాని పలుకుబడికి గండి పడుతుంది. మూడు పెద్ద రేటింగ్‌ సంస్థలు కూడా ఎఎఎ రేటింగ్‌ కానసాగిస్తున్న దేశాలు జర్మనీ, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, నార్వే, సింగపూర్‌, స్వీడన్‌, స్విడ్జర్లాండ్‌,ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి.ప్రపంచ పెత్తనం చేయాలంటే ఆర్థికంగా పటిష్టంగా ఉండాలి. తమ ఇంటినే చక్కదిద్దుకోలేని అమెరికా తమనెలా గట్టెక్కిస్తుందని ఇంతకాలం దాని కోసం వెంపర్లాడుతున్న దేశాలన్నీ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. అమెరికా డొల్లతనాన్ని ఫిచ్‌ వెల్లడించి అనేక మందికి కనువిప్పు కలిగించింది.

Spread the love