నవతెలంగాణ – హైదరాబాద్: ఆగ్రాలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్న 25 ఏళ్ల యువతిపై గత శనివారం నలుగురు వ్యక్తులు సాముహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమెను ఓ రిచ్ హోమ్‌స్టేకి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆగ్రా సదర్ ఎస్పీ అర్చనా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళపై అత్యాచారం, దాడి జరిగినట్లు శనివారం రాత్రి తాజ్‌గంజ్ పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకొని.. బాధితురాలిని రక్షించారు. నిందితులు తనకు సంబంధించిన ఓ అభ్యంతరకరమైన వీడియోను రూపొందించారని, దాని ద్వారా తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు బాధిత యువతి పోలీసులకు వెల్లడించింది. బలవంతంగా తనకు మద్యం తాగించారని, గాజు సీసాతో బలంగా తలపై కొట్టారని పోలీసుల ముందు వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఓ మహిళ సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితులంతా ఆగ్రాకు చెందిన వారే అని పేర్కొన్నారు. వారిపై లైంగిక దాడి సహా పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేసినట్లు వెల్లడించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆగ్రా సదర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అర్చనా సింగ్ తెలిపారు.