కువైట్‌లో ఐదుగురికి ఉరి

కువైట్‌ సిటీ : కువైట్‌ ప్రభుత్వం గురువారం ఐదుగురిని ఉరి తీసింది. కువైట్‌లో మసీదుపై జరిగిన ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపు ఆత్మాహుతి దాడితో ప్రమేయమున్న నేరస్తుడు కూడా ఈ ఐదుగురిలో వున్నాడని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ తెలిపింది. ఈ దాడిలో 26మంది చనిపోయారు. పొరుగున వున్న సౌదీ అరేబియాతో పోలిస్తే కువైట్‌లో పలువురిని ఒకేసారి ఉరి తీయడం చాలా అరుదు. ఐదేళ్ళపాటు విధించిన మారిటోరియాన్ని ఎత్తివేసిన తర్వాత గతేడాది నవంబరులో ఏడుగురిని ఉరి తీశారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ మరణ శిక్షలు అమలయ్యాయి. కువైట్‌ సెంట్రల్‌ జైల్లో ఐదుగురి మరణ శిక్ష అమలును పర్యవేక్షించినట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. వీరిలో చాలామది హత్యలకు పాల్పడినవారే. 2015లో శుక్రవారం ప్రార్ధనల సందర్భంగా నగరంలోని షియా మసీదుపై బాంబు దాడి జరిగింది. ఆ దాడి కేసులో ప్రధాన దోషి అబ్దుల్‌ రహమాన్‌ సాబా సాద్‌ ఈ ఐదుగురిలో వున్నాడు. కువైట్‌ చరిత్రలోనే అత్యంత దారుణమైన దాడి ఇది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన బాంబర్‌ను మసీదు వరకు తీసుకెళ్ళిన, సౌదీ సరిహద్దు సమీపం నుండి పేలుడు పదార్ధాల బెల్ట్‌ను తీసుకువచ్చిన వ్యక్తి అబ్దుల్‌ రహమాన్‌. కువైట్‌లో మరణ శిక్షల అమల్లో కలతపెట్టే పెరుగుదలకు ఇది మరో ఉదాహరణ అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వ్యాఖ్యానించింది. ఈ ప్రాంతంలో ఉరి శిక్షలు చాలా సర్వ సాధారణం. ముఖ్యంగా ఇరాన్‌, సౌదీ అరేబియాల్లో ఎక్కువ. ఈ ఏడాదిలోనే సౌదీలో ఇప్పటివరకు 74మందిని ఉరి తీశారు. ఇంకా 64మంది ఆ జాబితాలో వున్నారు.

Spread the love