తెలంగాణలో వడదెబ్బతో ఐదుగురు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్
రాష్ట్రంపై సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భానుడి భగభగలతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విలవిలలాడిపోతున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలతో నల్గొండ జిల్లా అల్లాడుతోంది. శుక్రవారం సైతం ఈ జిల్లాలోని దామరచర్లలో 45.4, నేరేడుగొమ్ములో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 45.4, నిర్మల్‌ జిల్లా కడెం పెద్దూరులో 45.1 డిగ్రీలు నమోదయ్యాయి. మంచిర్యాల, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో 44.3 డిగ్రీల నుంచి 44.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఎండల తీవ్రతకు అస్వస్థతకు గురై ప్రజలు చనిపోతున్నారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే వడదెబ్బతో ఐదుగురు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురంలో శుక్రవారం ఒక్కరోజే తన్నీరు మనోహర్‌(47), బేతం చిన్ని(56), అచ్చె రామారావు(74)లు మృతి చెందారు. జిల్లా కేంద్రమైన మహబూబాబాద్‌ శివారులోని గాంధీపురంలో వ్యవసాయ కూలి గండమల్ల వెంకటయ్య(67), హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లో శివాలయం రోడ్‌లోని జామియా మసీద్‌ వద్ద గుర్తుతెలియని వ్యక్తి(55) వడదెబ్బతోనే మృతి చెందారు.

Spread the love