నవతెలంగాణ – ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు నెలలు గడుస్తున్నా అదుపులోకి రావడం లేదు. బలమైన కార్చిచ్చు కారణంగా అక్కడి అడవులు తగలబడిపోతున్నాయి. దీంతో ఆర్మీ, ఎయిర్ఫోర్స్ రంగంలోకి దిగి హెలికాప్టర్ల ద్వారా నీటిని వెదజల్లినా మంటలు అదుపులోకి రావడం లేదు. ఇక ఈ మంటలకు నాలుగు రోజుల్లో సుమారు ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. గతేడాది నవంబర్ 1 నుంచి ఇప్పటి వరకూ ఉత్తరాఖండ్ అడవుల్లో మొత్తం 910 అగ్నిప్రమాదాలు సంభవించాయి. దాదాపు 1,145 హెక్టార్లలో అటవీ ప్రాంతం ప్రభావితమైంది. దాదాపు ఆరు నెలలుగా అక్కడి అడవులు కాలిపోతున్నాయి. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసిన మంటలు అదుపులోకి రావడం లేదు. మరోవైపు మంటల కారణంగా భారీగా ఎగసిపడుతున్న పొగ స్థానికులకు ఊపిరాడకుండా చేస్తోంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వర్షం పడితేనే అడవుల్లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.