– ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కు ఫీల్డ్ అసిస్టెంట్ల వినతిపత్రం అందజేత..
నవతెలంగాణ – డిచ్ పల్లి
జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ఏళ్ళ తరబడి పనిచేస్తున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు మాట్లాడుతూ ఉపాధి హామి హక్కుదారులైన కూలీలకు రోజువారి వేతనం 400/-రూ॥లకు పెంచుతూ ఒక ఆర్థిక సంవత్సరంలో 150 రోజుల పని దినాలు కల్పించడం,ఫీల్డ్ అసిస్టెంట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ, పే-స్కూల్ వర్తింపచేయాలని విన్నవించారు. జనవరి మాసం నుండి మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలను తక్షణమే చెల్లించాలని,ఉపాధి హామిలో పనిచేయుచున్న మిగతా అన్ని స్థాయిల ఉద్యోగుల మాదిరిగానే ఫీల్డ్ అసిస్టెంట్లకు “ఎఫ్.టి.ఈ.” లుగా కన్వర్ట్ చేసి కనీసం వేతనం రూ. 25,000 ఇవ్వాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు హెల్త్ కార్డులు ఇచ్చి విధి నిర్వహణలో మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబానికి 10 లక్షల ఎక్స్రేషియా ఇవ్వాలని, 4779 సర్కూలర్ను రద్దు చేసి లిస్టు 3 క్రింద తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోనే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే విధంగా చూడాలని, న్యాయమైన డిమాండ్లను మానవతా దృక్పధంతో పరిష్కరించి మాకు మా కుటుంబాలకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. కలిసిన వారిలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని అయా మండలాలకు చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.