ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18వేలివ్వాలి

– ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులను ముట్టడించిన ఆశాలు
– సమస్యలు పరిష్కరించాలని వినతులు
”తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18వేలు ఇవ్వాలి.. దీనిపై వచ్చే బడ్జెట్‌ సమావేశంలో అసెంబ్లీలో ప్రకటించాలి” అంటూ తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేశారు.
నవతెలంగాణ- విలేకరులు
”తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18వేలు ఇవ్వాలి.. దీనిపై వచ్చే బడ్జెట్‌ సమావేశంలో అసెంబ్లీలో ప్రకటించాలి” అంటూ తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేశారు.
నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు క్యాంపు కార్యాలయం వద్దకు ఆశాలు పెద్దఎత్తున చేరుకున్నారు. క్యాంపు కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో వినతిపత్రాన్ని గేటుకు అతికించారు. నిజామాబాద్‌ రూరల్‌, అర్బన్‌, బాల్కొండ, బోధన్‌, బాన్సువాడ, జుక్కల్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేల క్యాంప్‌ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టి వినతిపత్రాలు అందజేశారు.
వికారాబాద్‌లో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ క్యాంపు కార్యాలయం ఎదుట సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్‌.మహిపాల్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. స్పీకర్‌ పీఏకు వినతిపత్రం అందజేశారు. పరిగి పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఇంటి వద్ద, కొడంగల్‌లోని కాడ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డికి మెమోరాండం అందజేశారు. తాండూర్‌లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ఎదుట బైటాయించారు. మహబూబ్‌నగర్‌, దేవరకద్ర, నాగర్‌కర్నూల్‌, జడ్చర్ల, కల్వకుర్తి, నారాయణపేట, కొల్లాపూర్‌, మక్తల్‌లో ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యేల కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. భూపాలపల్లిలో ఆశాలు ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ ముందు నిరసన తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో పోస్ట్‌ ఆఫీస్‌ నుంచి ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసు వరకు ర్యాలీ చేపట్టారు. పోలీసులు మధ్యలో అడ్డుకున్నారు. అనంతరం మంత్రి సీతక్క పీఏకు వినతిపత్రం అందించారు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతిపత్రం అందించారు. సిద్దిపేట పట్టణంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు పీఏకు వినతిపత్రం అందించారు. దుబ్బాకలోని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యేల కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేతో ఫొన్లో మాట్లాడి వారి సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని హామీ తీసుకొని పీఏకి మెమోరాండం అందించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు క్యాంపు కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఎమ్మెల్యే పీఏకు వినతిపత్రం అందజేశారు. దమ్మపేట, ఇల్లందు మండలంలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేశారు.
నల్లగొండ ఎమ్మెల్యే, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంప్‌ ఆఫీస్‌ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. హాలియా మండల కేంద్రంలో ఎమ్మెల్యే కాంప్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, వినతిపత్రం అందజేశారు. మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. దేవరకొండలో ఎమ్మెల్యే బాలునాయక్‌ క్యాంపు కార్యాలయాన్ని ఆశావర్కర్లు ముట్టడించి.. ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. నకిరేకల్‌లో ఆశా వర్కరు ర్యాలీ నిర్వహించి, ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం అందజేశారు.
హైదరాబాద్‌ ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను కార్యాలయంలో కలిసి ఆశాలు వినతిపత్రం అందజేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌ ఎమ్మెల్యే రాగిడి లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. బోయన్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం వద్ద, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి ఆఫీస్‌ ఎదుట నిరసన తెలిపారు.

Spread the love