శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో … ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిన విమానాలు

నవతెలంగాణ హైదరాబాద్:  ఓ ఎయిర్‌లైన్స్‌ సంస్థ సర్వర్‌ డౌన్‌ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. ఈ సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాలివీ.. దేశీయ విమాన సర్వీసుల్లో ప్రధాన నగరాలకు వెళ్లడానికి ప్రయాణికులు ఓ ఎయిర్‌లైన్స్‌ సంస్థలో టికెట్లు కొనుగోలు చేశారు. కొందరు విమానాశ్రయానికి చేరుకుని వెబ్‌ చెక్‌ఇన్‌ కోసం యత్నించగా సర్వర్‌ పని చేయలేదు. టికెట్‌లు చేతుల్లో ఉన్నప్పటికీ ప్రయాణికుల జాబితాలో వారి పేర్లు లేవని సిబ్బంది లోపల గేటు వద్ద వారిని అనుమతించలేదు.
దీంతో సహనం కోల్పోయిన కొందరు ప్రయాణికులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ ఘటనపై ఆలస్యంగా స్పందించిన యాజమాన్యం తమ వేరే సర్వీసుల్లో గమ్యస్థానాలకు పంపిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.  విమానాశ్రయ అధికారులు మాత్రం ఈ విషయమే తమ దృష్టికి రాలేదంటున్నారు. సర్వర్‌ను పునరుద్ధరించుకునే బాధ్యత సంబంధిత ఎయిర్‌లైన్స్‌ సంస్థదే అని  వారు తెలిపారు.

Spread the love