విశాఖ బీచ్ లో ఒక్కరోజులో తెగిపోయిన ఫ్లోటింగ్ వంతెన

నవతెలంగాణ – విశాఖపట్నం: ఆదివారం వైకాపా నేతలు విశాఖ బీచ్‌లో అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్‌ వంతెన ఒక్కరోజులోనే తెగిపోయింది. అధికారులు వైకాపా నేతలను ప్రసన్నం చేసుకోవడానికి చూపించిన శ్రద్ధ పర్యాటకుల రక్షణ చర్యలపై చూపించలేదు. సోమవారం నుంచి సందర్శకులను అనుమతించాలని భావించగా.. అంతలోనే అది కాస్తా రెండు ముక్కలైంది. ఆ సమయంలో పర్యాటకులు లేరు కనుక సరిపోయింది. లేకపోతే పెను విషాదం జరిగి ఉండేది! సముద్ర తీరం నుంచి లోపలికి వంద మీటర్ల పొడవున ఫ్లోటింగ్‌ డబ్బాలతో ఈ వంతెనను ప్రైవేటు వ్యక్తిచేత విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఏర్పాటు చేయించింది. ‘టీ’ ఆకారంలో ఉన్న దాని మీద నడుచుకుంటూ వెళ్లి చివరన నిలబడి సముద్రాన్ని వీక్షించొచ్చు. ఇప్పుడు ఆ వీక్షించే భాగమే తెగిపోయింది. అనుసంధానంగా ఉన్న ప్రాంతం నుంచి అది తెగిపడి సుమారు మూడు వందల మీటర్ల దూరంలోకి వెళ్లిపోయింది. అలల తీవ్రతకు అనుసంధాన బోల్టులు విరిగిపోయాయి. ఒకవేళ వంతెనపై పర్యాటకులు ఉండి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అధికారులు మాత్రం ట్రయల్‌ రన్‌ అని, సాంకేతిక పరిశీలనలో భాగంగా దానిని వేరు చేశామని చెబుతున్నారు. వాస్తవానికి విరిగిన బోల్టులు చూస్తే తెగిపడినట్లే ఉంది. దీని కోసం రూ.1.60 కోట్లు ఖర్చు చేశారు. నిర్వాహకులు మూడేళ్ల పాటు ఏటా రూ.15 లక్షలు వీఎంఆర్‌డీఏకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఘటన తరువాత వీఎంఆర్‌డీఏ సంయుక్త కమిషనర్‌ రవీంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ అలల తీవ్రత ఎక్కువ ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ఏర్పాటుపై నిపుణులు ముందునుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతం తూర్పు తీరం చాలా ప్రమాదకరమైంది. నిత్యం అల్లకల్లోలంగా ఉంటుంది. తుపాన్లు, ఈదురుగాలుల సమయంలో అలల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట పర్యాటకుల ఆహ్లాదం కోసం ఈ రకమైన వంతెనలు ఏర్పాటు చేయడం ప్రమాదకరమని వారు అభిప్రాయపడుతున్నారు. అయినా ఇవేవి పట్టించుకోకుండా ‘కురుసురా జలాంతర్గామి’కి సమీపంలో దీన్ని నిర్మించారు. సోమవారం అలల తీవ్రతకు వంతెన నాలుగు అడుగులు పైకి ఎగిరింది. ఇక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో పాటు అలలు ఎగసిపడుతుంటాయి. తెన్నేటిపార్క్‌ వద్ద అనుమతించకపోవడంతో.. వీఎంఆర్‌డీఏ మొదట ఫ్లోటింగ్‌ బ్రిడ్జిని తెన్నేటిపార్క్‌ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ ప్రాంతం తీర పరిరక్షణ కింద ఉండడంతో అటవీశాఖ అడ్డుకుంది. అనంతరం రుషికొండ తీరంలో అనువైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థకే సరిపడినంత స్థలం లేకపోవడం, పర్యాటకుల తాకిడి అధికంగా ఉండటంతో అక్కడా వద్దనుకున్నారు. చివరికి ఆర్‌కే బీచ్‌లో నిర్మించారు. ‘26వ తేదీ నుంచి సందర్శకులను అనుమతించాలనుకున్నాం. అలల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం. ఈ సమయంలో వంతెన టీ పాయింట్‌ పటిష్ఠత పరిశీలించేందుకు దాన్ని విడదీశాం. వంతెన, వ్యూపాయింట్‌ మధ్య ఖాళీ ప్రదేశాన్ని కొందరు ఫొటో తీసి దుష్ప్రచారం చేస్తున్నారు. సాంకేతిక పరిశీలనలో భాగంగానే ఇదంతా చేశాం’ అని వీఎంఆర్‌డీఏ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Spread the love