వరదల నష్ట నివారణ చర్యలు వెంటనే చేపట్టాలి

– జూలకంటి రంగారెడ్డి సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

నవతెలంగాణ-గోవిందరావుపేట
వరదల నష్ట నివారణ చర్యలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని మాజీ సిపిఎం శాసనసభాపక్ష నేత సిపిఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ములుగు జిల్లా వ్యాప్తంగా వరద దెబ్బతిన్న ప్రదేశాల్లో సిపిఎం బృందం పరిశీలించింది. మండలంలోని పసర ప్రాజెక్టు నగర్ గ్రామాల్లో వరదల వల్ల దెబ్బతిన్న ఇండ్లను పంట పొలాలను విద్యుత్తు లైన్ల తోపాటు ఇటీవల వరదల్లో కొట్టుకుపోయి మృతి చెంది నేడు దెయ్యాల వాగు సమీపంలో దొరికిన  సద్దాం హుస్సేన్ మృతదేహాన్ని కూడా పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ ఈనెల 26 రాత్రి న అనుకోకుండా ఆకస్మాత్తుగా భారీ వర్షం రావడం సంవత్సరం పొడవున కూర వాల్సిన వర్షపాతం ఒకే పూట నమోదు కావడం భారీ వరదలు రావడం రాత్రివేళ కావడంతో చాలా నష్టం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా పసర రంగాపూర్ ప్రాజెక్ట్ నగర్ మేడారం రెడ్డిగూడెం నార్లపురం దొడ్ల మల్యాల ఐలాపురం కొండాపూర్ తదితర గ్రామాలలో సుమారు 2000 నివాస గృహాలు దెబ్బతిన్నాయని అన్నారు. మరో 500 గృహాలు పక్షికంగా దెబ్బతినడం జరిగింది అన్నారు. పూర్తిగా దెబ్బతిన్న గృహాల స్థానంలో ప్రభుత్వము గొప్పగా చెప్పుకుంటున్న డబుల్ బెడ్ రూమ్ గృహాలను నిర్మించి వరదల్లో గృహపకరణాలను కోల్పోయినందున గృహపకరణాలను కూడా ప్రభుత్వమే వరద బాధితులకు అందించాలని అన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు మరమత్తుల కోసం  మూడు లక్షల రూపాయలను తక్షణమే సర్వే చేసి విడుదల చేసి బాధితులను ఆదుకోవాలని కోరారు.
ఇసుక మేటలు వేసిన భూములను వ్యవసాయానికి అనుకూలంగా మార్చాలి
జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో వేలాది ఎకరాలు ఇసుక మేటలు పెట్టడం జరిగిందని లోతైన కొయ్యలుగా కోయడం జరిగిందని వ్యవసాయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకూలంగా లేకుండా వరదల్లో కొట్టుకుపోవడం జరిగిందన్నారు. ఎల్బీనగర్ దుంపలగూడెం లక్ష్మీపురం గోవిందరావుపేట బుస్సా పురం సోమల గడ్డ రాఘవపట్నం మోట్ల గూడెం ప్రాజెక్టు నగర్ ముత్తాపూర్ టపా మంచే లక్ష్మీపూర్ ముద్దుల గూడెం అమృతండా చంద్రు తండా  వెంగలాపురం గోనెపల్లి నార్లపురం కొత్తూరు కాలువపల్లి కన్నెపల్లి మేడారం రెడ్డిగూడెం ఊరటం దొడ్ల మల్యాల కొండాయి ఐలాపురం గ్రామాల్లో సుమారు 12 వేలకు పైగా ఎకరాల్లో ఇసుక మేటలు వేయడం  వ్యవసాయానికి అక్కర రాకుండా పోవడం జరిగిందన్నారు. వేలాది విద్యుత్తు మోటార్లు పైపులు పంపుసెట్లు స్టార్టర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి రైతులను దివాలా తీయించాయన్నారు. కొందరు నాట్లు వేయగా మరికొందరు నాట్లు వేసేందుకు నార్లు పోసుకోగా అవేవీ లేకుండా పోవడం జరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే సర్వేలు నిర్వహించి స్పందించి ఒక ఎకరానికి లెవెలింగ్ కొరకు 50 వేల రూపాయలు అందించాలని విద్యుత్తు మోటార్లను స్టార్టర్లను పైపులను ఉచితంగా రైతులకు అందించాలని అన్నారు. మరో నాలుగు మాసాలు ఎన్నికలు ఉన్నందున పంటలు దెబ్బతిన్న రైతులను వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతారని అన్నారు.
మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి.
వరద ప్రవాహంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 12 మంది మృతి చెందినట్లుగా తమ దృష్టికి వచ్చిందని కొండాయిలో ఎనిమిది మంది ప్రాజెక్టు నగర్ లో ముగ్గురు మేడారంలో ఒకరు మృతదేహాలు లభ్యం అయ్యాయని అన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వ ప్రకటించి ఆదుకోవాలని అన్నారు. ప్రాజెక్ట్ నగర్ గ్రామంలో ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడం బాధాకరం అన్నారు. ఈరోజు లభ్యమైన సద్దాం హుస్సేన్ మృతదేహాన్ని పరిశీలించి తండ్రి రెహమాన్ కు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తరఫున న్యాయం జరిగే విధంగా తమ వంతు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.
రహదారులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలి
ములుగు జిల్లాలో వరదల వల్ల జాతీయ మరియు ఆర్ అండ్ బి, పి ఆర్ రహదారులు చాలావరకు దెబ్బతిన్నాయని వారం రోజులైనా ఇప్పటికీ వాహనాలు నడవని పరిస్థితులు కొన్ని చోట్ల నెలకొన్నాయని అన్నారు. జాతీయ రహదారి అధికారులు మరియు ఆర్ అండ్ బి అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు వెంటనే నివేదికలను పంపి యుద్ధ ప్రాతిపాదికన తాత్కాలిక మరమ్మతులతో ప్రజల ప్రయోజనార్థం రహదారులకు మరమ్మత్తులు చేపించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని అన్నారు.
ప్రాజెక్టునగర్ గ్రామ వాసులకు సురక్షిత ప్రదేశంలో ఇల్లు నిర్మించాలి
వరదల వల్ల అత్యంత భారీగా నష్టపోయిన ప్రాజెక్టు నగర్ గ్రామాన్ని మళ్లీ వరదలు కాటేయకుండా ఎత్తైన ప్రదేశంలో నిర్మించే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రాజెక్టునగర్ గ్రామస్తులు తాము పడిన బాధలను వారి గృహాలను అక్కడి పాఠశాలను పరిశీలించినట్లయితే భవిష్యత్తులో ఈ ప్రదేశము నివాసానికి ఎంత మాత్రం ఆమోదయోగ కాదని గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వరదలు మృతి చెందడం జరిగిందని సమయంలో వృద్దులు చెబుతున్న పడిన బాధలు గ్రామంలో చరిత్ర గా మిగిలిపోతాయని అన్నారు. గ్రామస్తులు కూడా తమకు వరద ప్రభావం లేని సురక్షితమైన ప్రదేశంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరుతు ఈ మేరకు ప్రభుత్వంతో మాట్లాడాలని విన్నవించుకున్నారు.
వరద బాధితులకు వంట సరుకుల పంపిణీ
మండలంలోని పసర గ్రామంలో వరదల వల్ల దెబ్బతిన్న డబుల్ బెడ్ రూమ్ గృహ వాసులకు సిపిఐఎం పార్టీ దాతల ద్వార సేకరించిన వంట సరుకులను రంగారెడ్డి మరియు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజే నర్సింగరావులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ
ప్రజలకు వరదల వల్ల పూడ్చలేని నష్టం జరిగింది ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి సర్వేలు నిర్వహించకుండా మంత్రులు ఎమ్మెల్యేలు రోడ్ షో లకే పరిమితమయ్యారని అన్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి గృహాలు కోల్పోయిన వారికి గృహాలు దెబ్బతిన్న గృహాలకు బదులు మరమ్మలకు తక్షణ సహాయం అందించాలని దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించాలని రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని దాతలు బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సూరి కృష్ణారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, బి రెడ్డి సాంబశివ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, సిపిఎం మండల కార్యదర్శి తీగల ఆగి రెడ్డి, అంబాల పోషాలు, జిల్లా కమిటీ సభ్యులు పొదిల చిట్టిబాబు , రెడ్డి పురుషోత్తం రెడ్డి, అంతటి నాగరాజు, ముమ్మిడి ఉపేంద్ర చారి, సోమ మల్లారెడ్డి, క్యాతం సూర్యనారాయణ,  గొంది రాజేష్ కందుల రాజేశ్వరి జిమ్మ జ్యోతి సునీత మంచాల కవిత జీవన్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love