హిమాచల్​లో వరద బీభత్సం.. రూ.180కోట్ల సాయం చేసిన కేంద్రం

నవతెలంగాణ – హిమాచల్ ప్రదేశ్
గత కొన్నిరోజులుగా హిమాచల్ ప్రదేశ్ వరదలతో అతలాకుతలమైన విషయం తెలిసిందే. దాదాపు 100 మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. కోట్లలో ఆర్థిక నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో వరదలతో అతలాకుతలమైన హిమాచల్‌ ప్రదేశ్‌కు కేంద్రం అండగా నిలిచింది. రాష్ట్రం వరద ప్రభావం నుంచి కోలుకోవడానికి రెండో విడత సహాయ నిధిని ముందస్తుగా విడుదల చేసేందుకు కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆమోదం తెలిపారు. రూ.180.40 కోట్లను ఎస్‌డీఆర్‌ఎఫ్‌ (ఎస్డీఆర్ఎఫ్)కి కేటాయించారు. వరద బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం హిమాచల్‌ ఎస్డీఆర్ఎఫ్ కి 2023-24 సంవత్సరంలో విడుదల చేయాల్సిన సహాయ నిధిని ముందుగా విడుదల చేయనున్నట్లు అధికారక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే జులై 10న మొదట విడత కింద రూ.180.40 కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇటీవల భారీ వర్షాలకు వరదలు సంభవించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలను పరిశీలించడానికి కేంద్రం ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీమ్‌ (ఐఎంసీటీఎస్)లను కూడా ఏర్పాటు చేసింది.

Spread the love