నేపాల్ లో వరద బీభత్సం.. 5 మంది మృతి

నవతెలంగాణ – హైదరాబాద్
నేపాల్ ని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వరదలు సంభవించాయి. తూర్పు నేపాల్ లోని మూడు జిల్లాల్లో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా నదులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 5 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28మంది గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. చైన్‌పూర్ మున్సిపాలిటీ-4 ప్రాంతంలో హేవా నది ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో సూపర్ హేవా హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్ద వరదలు సంభవించి అక్కడ పనిచేస్తున్న 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. చైన్‌పూర్, పంచ్‌ఖపన్ మున్సిపాలిటీల్లో కొండచరియలు విరిగిపడి నదీ ప్రవాహనాన్ని అడ్డుకోవడం వల్లే ఈ వరదలు సంభవించినట్టు అధికారులు తెలిపారు. వరదల కారణంగా పలు ప్రాంతాల్లోని ఇళ్లు కొట్టుకుపోయాయి. రానున్న రోజుల్లో నేపాల్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Spread the love