ఢిల్లీకి పొంచివున్న వరద ముప్పు

ఢిల్లీకి పొంచివున్న వరద ముప్పు
ఢిల్లీకి పొంచివున్న వరద ముప్పు

నవతెలంగాణ ఢిల్లీ: ఢిల్లీకి వరద ముప్పు పొంచివుంది. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ-కశ్మీర్‌ వంటి రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్నందున యమున సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి వరద హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నదిలో నీటి మట్టం 203.33 మీటర్లను తాకింది. హర్యానాలోని హతిన్‌కుంద్‌ బ్యారేజ్‌ నుంచి ఈ ఉదయం యమునా నదిలోకి 2.79లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నీటిమట్టం పెరిగింది. దీంతో యంత్రాంగం అప్పమత్తమైంది. ఇప్పటికే 16 కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసింది. ఢిల్లీ, నొయిడా, గురుగ్రామ్‌లలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించింది.

17 రైళ్లు రద్దు

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల ఉత్తర రైల్వే అప్రమత్తమైంది. 17 రైళ్లను రద్దు చేసింది. మరో 12 రైళ్లను దారి మళ్లించింది. రద్దు చేసిన రైళ్లలో ఫిరోజ్‌పుర్‌ కాంట్‌ ఎక్స్‌ప్రెస్‌, అమృత్‌సర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, చండీగఢ్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, చండీగఢ్‌ – అమృత్‌సర్‌ జంక్షన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉన్నాయి. దారి మళ్లించిన వాటిలో ముంబయి సెంట్రల్‌- అమృత్‌సర్‌ ఎక్స్‌ప్రెస్‌, దౌలత్‌పుర్‌ చౌక్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లు ఉన్నాయి.

50 ఏళ్ల రికార్డును బద్దలు

గత 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షం పడగా.. చండీగఢ్‌, హర్యానాలోని అంబాలాలో వరుసగా 322.2 మిమీ, 224.1 మిమీ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (ఎంఐడీ) తెలిపింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌లో ఆదివారం 135 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని.. 1971లో ఒక రోజులో 105 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఇప్పుడు 50 ఏండ్ల రికార్డును బద్దలు కొట్టిందని సిమ్లా వాతావరణ శాఖ డైరెక్టర్‌ సురేందర్‌ పాల్‌ తెలిపారు.

Spread the love