లిబియాలో వరద విలయం.. 2వేల మంది మృతి..

నవతెలంగాణ – లిబియా: ఆఫ్రికా దేశం లిబియాలోని దెర్నా నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల ధాటికి ఆ నగరంలో 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గల్లంతయ్యారు. ఓ వార్తా సంస్థకు ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆ దేశ ప్రధానమంత్రి ఒసామా హమద్ .. దెర్నాలోని అనేక ప్రాంతాలు వరదలో కొట్టుకుపోయాయని చెప్పారు. మధ్యధరా సముద్రంలో సంభవించిన డేనియల్ తుపాను.. లిబియాను అతలాకుతలం చేస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుపాను ధాటికి ఇప్పటికే తూర్పు లిబియాలోని అనేక ప్రాంతాల్లో కల్లోలిత పరిస్థితులు నెలకొన్నాయని.. తీవ్రంగా ప్రభావితమైన నగరాల్లో దెర్నా సైతం ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని డిజాస్టర్ జోన్​గా ప్రకటించారు. దెర్నాలో వరద పెను విలయం సృష్టిస్తున్నట్లు స్థానిక మీడియో తెలిపింది. విద్యుత్​ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. తూర్పు లిబియా ఆరోగ్యశాఖ మంత్రి ఒత్మాన్​ అబ్లుల్​ జలీల్​ సోమవారం మధ్యాహ్నం ఏఎల్​-అరేబియా న్యూస్​ ఛానెల్​కు టెలిఫోన్​ ఇంటర్వ్యూలో మరణాల సంఖ్యను ప్రకటించారు. 50 మంది గల్లంతైనట్లు తెలిపారు.  తాను చెప్పిన మరణాల సంఖ్యలో డెర్నా నగర మృతులను చేర్చలేదని చెప్పారు.

Spread the love