పూల బతుకులు

Flowers are aliveనీ బతుకు, నా బతుకు, మనందరి బతుకు
ఈ పూల బతుకు తీరే చెల్లీ….

మనకు, పూలకు
పుట్టడం, పూయడమే వేరు వేరు కానీ
పూల జీవితం, మన జీవితం ఒక్కతీరే

శవాలపై బలవంతంగా ఉంచబడుతున్న పూలు
శవాల ముందు చిటికేస్తూ
విధిలేక ఆడుతున్న మన బతుకులు

గౌరవానికి పూలది, మనది ఒకటే
అవసరానికే పూలైనా, మనమైనా
అక్కర తీరిందా… ఇద్దరి బతుకు చెత్త బుట్టలోకే…

నీ, నా, మన పేదలందరి బతుకులు
వడలి పోయిన పువ్వుల మాదిరే…
వాటికింత జీవం రావాలంటే…
అక్షరాల నీళ్ళు చల్లాలసిందే…

చెల్లీ…
నీవు ఇంట్లో ఉండి సదువుకుంటే…
అమ్మొక్కతే అమ్మే కూరగాయలతో ఇల్లు గడువదు
నీవు పూలమ్ముకుంటూనే ఉంటే…
రేపటి నీ బతుకు వెలుగదు

‘దేశమేలిగిపోతుంది.. భేటీ బచావో..భేటీ పడావో’ అని
గప్పాలు కొట్టేటోల్ల గల్లాలు పట్టి
నువ్విట్టా నాలుగు బజాట్ల వీధి లైట్లకింద
కూసోడానికి కారకులెవరని నిలదీయాలని ఉంది

చెల్లీ….
ఈ రాతిరి నిన్నిక్కడా ఇట్లా చూస్తుంటే
రేపటి పొద్దున ఉదయించడానికి
ఏ పడమటి కొండల మాటునో
కసరత్తులు చేస్తున్న సూర్యుణ్ణి చూసినట్టే ఉంది

ఈ వీధి దీపాలు
మనకెక్కువ కాలం వెలుగివ్వ లేవు తల్లీ…
మనకు మనమే స్వయం ప్రకాశకమై వెలుగాలి

పాడైన పూలుంటే పారెయ్యకు చెల్లీ
తెల్లారితే…..
జీవచ్చవమవుతున్న ఈ దేశపు
రాజ్యాంగం అమలు యాత్రోకటి పోతుంది
జాలితోనే దానిపై ఇన్ని చల్లడానికి పనికొస్తాయి

కుళ్ళిపోయిన పూలుంటే దాసి పెట్టు తల్లీ..
హంతకులే….
ఈ యాత్రలో మొసలి కన్నీటి ప్రసంగాలతో
పూలు చల్లించుకోవాలనుకుంటారు
వారి మొఖాలపై
చీత్కారంతో విసిరెయ్యడానికి పనికొస్తాయి

చెల్లీ….
నిండు రాజ్యాంగం మనందరకూ…
బాకే ఉన్నది ఇంకా….

(హన్మకొండలో రోడ్డుపై పూలమ్ముతు చదువుకుంటున్న చెల్లెలిని చూసీ…. రాసినది)
– దిలీప్‌. వి, 8464030808

Spread the love