ఉపాధిపై ఫోకస్‌

Focus on employment– అగ్నివీర్‌ విషయంలో కేంద్రంపై ఆగ్రహం
– బీజేపీని దూరం పెడుతున్న ఓటర్లు
– సిట్టింగ్‌ స్థానాల్లో జేజేపీకి ఆదరణ కరువు
– ఉనికి కోసం ఆప్‌ పాకులాట
– జులానా నియోజకవర్గంపై అందరి దృష్టి
– కాంగ్రెస్‌ అభ్యర్థి వినేశ్‌ ఫొగట్‌కు ప్రజల నుంచి మద్దతు
– రాజకీయ విశ్లేషకులు, పరిశీలకుల అంచనాలు

బీజేపీ మాజీ మిత్రపక్షం జేజేపీ నుంచి అమర్‌జిత్‌ ధండా సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, జేజేపీ సైతం ఇప్పుడు ఇక్కడి జనాలను ఆకట్టుకోవటానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తున్నది. ఆ పార్టీ నిర్వహించే సమావేశాలకూ ప్రజల నుంచి స్పందన కనబడటం లేదు. ”మోడీ అనే అంశం కారణంగా గత ఎన్నికల్లో బీజేపీ వైపు ప్రజలు చూశారు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. రైతుల పోరాటం కాంగ్రెస్‌కు సహాయపడుతుంది” అని ధిగానా గ్రామ టీచర్‌ ఒకరు అన్నారు. అగ్నివీర్‌ పథకం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో అక్టోబర్‌ 5న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 8న తుది ఫలితాలు వెలువడనున్నాయి.
చండీగఢ్‌ : హర్యానాలో నిరుద్యోగం పెద్ద సమస్యగా పరిణమించింది. బీజేపీ పాలనలో ఇది తీవ్రమైంది. ప్రస్తుతం నిరుద్యోగం త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ప్రచారాస్త్రంగా మారనున్నది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ నిరుద్యోగం మీదనే మాట్లాడుతూ.. అధికార బీజేపీని ఇరుకున్న పెడుతున్నది. ఒలంపిక్స్‌ ఫైనల్‌లో తృటిలో పతకాన్ని చేజార్చుకున్న రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ జులానా నుంచి పోటీలో ఉన్నారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్‌, బీజేపీ నాయకుడు బ్రిజ్‌ భూషన్‌పై పోరాటంలో వినేశ్‌ది కీలక పాత్ర. ఈ పోరాటం పరోక్షంగా బీజేపీ అధిష్టానం, మోడీపై అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం అభివర్ణించారు. దీంతో జులానాపై అందరి దృష్టి పడింది.
జులానాలోనూ నిరుద్యోగ సమస్య ఉన్నది. దీనిపై వినేశ్‌ ప్రధానంగా దృష్టిని సారిస్తున్నారు. ”నేను పోటీ చేస్తున్నందున జులానాకు గుర్తింపు వస్తున్నదని ప్రజలు చెప్తున్నారు. వినేశ్‌ కోసం కాకుండా.. ఉపాధి, రెజ్లింగ్‌కు జులానా పేరు పొందాలని నేను అనుకుంటున్నాను” అని తన స్వంత గ్రామం నిడానాలోని ఓటర్లు, తన మద్దతుదార్లను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి, ఒలంపియన్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ అన్నారు. జులానాలో ఆమెకు అక్కడి ఓటర్ల నుంచి చక్కటి మద్దతు లభిస్తున్నది. ఎక్కడికి వెళ్లినా ఆమె కోసం ప్రజలు పెద్ద ఎత్తును స్వాగతం తెలుపుతున్నారు. ఆమె ప్రధానంగా ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెడుతున్నారు. అలాగే, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్‌ను వ్యతిరేకిస్తున్నారు. ప్రజలకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తున్నారు. వినేశ్‌ స్వగ్రామంలో రెజ్లింగ్‌కు చక్కటి ప్రాధాన్యత ఉన్నది. ఈ గ్రామం ఇండోర్‌ జిమ్నాసియం, రెజ్లింగ్‌ అఖాడా (అరేనా)ను కలిగి ఉన్నది. దీనిని స్థానికుల స్వచ్ఛంద సహకారంతో నిర్మించారు.
నిడానాలో జాట్‌ రైతులు ప్రధాన భూస్వాములుగా ఉన్నారు. వారిలో చాలా మంది భద్రతా దళాల్లోనూ చేరి సేవలు అందిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలు (రైతుల పోరాటాల తర్వాత రద్దయ్యాయి), భద్రతా దళాల్లో తాత్కాలిక నియామక ప్రక్రియ అయిన అగ్నివీర్‌.. జాట్‌లతో పాటు ఇక్కడి ప్రజలలో చాలా మందిని తీవ్రంగా దెబ్బ తీశాయని విశ్లేషకులు చెప్తున్నారు. జాట్‌లు, ఇతర హర్యానా ప్రజలు గర్వపడాల్సిన పరిస్థితులు లేవనీ, కొందరు యువకులు రోజువారీ కూలీ కోసం ఛత్తీస్‌గఢ్‌కు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిడానా గ్రామవాసి రామ్‌ ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ”ప్యారిస్‌లో ఏం జరిగిందో (ఫైనల్‌లో వినేశ్‌ ఫొగాట్‌ అధిక బరువు కారణంగా అనర్హురాలిగా ప్రకటించబడింది) అన్న విషయం నాకు సరిగ్గా తెలియదు. ఆశను కోల్పోకుండా, ప్రస్తుతం వ్యవస్థలో మార్పు కోసం పోరాడుతున్నందుకు ఆమె పట్ల మేము గర్వంగా ఉన్నాం” అని అన్నాడు. గ్రామంలో ఫొగాట్‌ను అక్కడి ప్రజలు కుల, మతాలకతీతంగా సన్మానించారు.
జింద్‌ జిల్లాలోని జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో జాట్‌ల ప్రాబల్యం ఎక్కువ. అలాగే, ఎస్సీలు 22.5 శాతంగా ఉన్నారు. భద్రతా దళాల్లో చేరి సేవలందించేవారిలో దళిత యువత కూడా ఉన్నది.
అయితే, అగ్నివీర్‌ పథకం తర్వాత ఆర్మీ సెలక్షన్‌పై వారిలో నిరాశను కలిగించిందని ఇక్కడి యువత చెప్తున్నది. దీంతో బీజేపీపై వారు ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ వినేశ్‌ ఫోగాట్‌ పోటీ చేస్తుండటంతో యువత ఓటు కాంగ్రెస్‌ వైపు మళ్లే అవకాశమున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఇక్కడ బీజేపీ నుంచి యోగేశ్‌ బైరాగీ పోటీలో ఉన్నారు. అలాగే, ఆప్‌ నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్‌ కవితా దళాల్‌ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆప్‌ ప్రభావం కొంత మాత్రమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ”ఆమె పహిల్వాన్‌ (‘రెజ్లర్‌’కు గౌరవ పదం) కాదు. ఆమె డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్‌. ఇక్కడ ఆప్‌నకు ఉనికి లేదు. హర్యానా పార్టీలైన ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌, జననాయక జనతా పార్టీ (జేజేపీ)లు పోటీ నుంచి దూరంగా ఉన్నాయి. దంగల్‌ (పోటీ) కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ఉంటుంది. వచ్చేసారరి ఆప్‌నకు కేజ్రీవాల్‌ వంటి నాయకుడు ఉంటే, మేము వారి వైపు చూస్తాం” అని జులానా పట్టణంలోని అగ్రికల్చర్‌ డీలర్‌ దల్బీర్‌ మాలిక్‌ అన్నాడు.

Spread the love