– సర్వే కేవలం సమాచార సేకరణకు మాత్రమే
– కలెక్టర్ ఇలా త్రిపాఠి
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
ప్రభుత్వ ప్రాధాన్య పథకాల పై అధికారులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రవేశపెట్టే నూతన అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలపై జిల్లా అధికారులు మొదలుకొని, గ్రామస్థాయి వరకు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నదని, సంబంధిత శాఖల అధికారులు రైతులకు, మిల్లర్లకు ఎవరికీ ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో కార్యక్రమం సామాజిక, ఆర్థిక, విద్య,రాజకీయ, కుల సర్వే అతిముఖ్యమైందని, ఈ సర్వే కేవలం సమాచార సేకరణకు మాత్రమే ఉద్దేశించిందని ఆమె స్పష్టం చేశారు. ఈ సర్వేలో భాగంగా ఈనెల 6 నుండి ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు.
సర్వే పకడ్బందీగా నిర్వహించేందుకుగాను జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ ను నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని, అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలలో ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని, ఈ శిక్షణ కార్యక్రమంలో ఇండ్ల జాబితా తయారు అనంతరం ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని తెలిపారు. కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య సంస్థలు కాకుండా మనుషులు నివసిస్తున్న అన్ని ఇండ్లకు వెళ్లి ఎన్యుమరేటర్లు వివరాలు సేకరించాలని, వివరాల సేకరణ అనంతరం ఆ ఇంటికి స్పీకర్ ను అతికించాలని తెలిపారు. సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ కుల సర్వే నిర్వహణకు అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. సామాజిక, ఆర్థిక,విద్య, రాజకీయ, కుల సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారుల భాగస్వామ్యం అవసరమని, 100 శాతం చిత్తశుద్ధితో సర్వేను నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. కాగా ఈ సోమవారం 45 మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను సమర్పించారు. ఎప్పటిలాగే ఈ సోమవారం సైతం పింఛన్లు, విద్య ,ఉపాది,వ్యక్తిగత అంశాలు, తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా అధికారులు ఉన్నారు.