పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలి

– వసూళ్లు చేయాల్సిన టార్గెట్‌ రూ.3 కోట్ల46లక్షల 87 వేల 687
– రూ. కోటి 88 లక్షల 65 వేల 841లు వసూళ్లు..
– మార్చి 31 వరకు 100శాతం పూర్తి చేసేందుకు కసరత్తు
– పంచాయతీల మెడపై విద్యుత్‌ బిల్లుల కత్తి
నవతెలంగాణ-శంకర్‌పల్లి
పన్నుల వసూళ్లపై అధికారుల ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామ పంచాయతీలో వసూళ్లు చేసే పన్నులతోనే గ్రామంలోని సమస్యల పరిష్కార మవుతాయి. సిబ్బందికి జీతాలు మిగతా అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే మండల పరిధిలోని 26 గ్రామ పంచాయతీల్లో రూ.లక్షా నుంచి 50 లక్షలకు పైగానే ఉంది. 2023 24 సంబంధించి రెండు నెలల క్రితమే పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ తిరిగి పన్నుల నోటీసులు పంపిణీ చేశారు. నూతన పంచాయతీరాజ్‌ యాక్ట్‌ ప్రకారం ప్రతీ ఏడాది డిసెంబర్‌ లోపే గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు చేయాల్సి ఉంది. డిసెంబర్‌లో వసూలయ్యే పన్నులపై ఆధారపడే ఈ ఏడాది ఖర్చులకు సంబంధించి ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. పంచాయతీలో మార్చి 31 వరకు 100శాతం పన్నులు టార్గెట్‌గా నిర్ణయించుకుని వసూళ్లకు కృషి చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లు అనంతరం పన్నుల వసూళ్లపై ప్రాముఖ్యత ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో వసూలు అయ్యే పనులతోనే పరిపాలన సాగుతోంది. పంచాయతీ సిబ్బంది జీత భత్యాలు కూడా అందిస్తున్నారు.
మేజర్‌ గ్రామాల్లో విస్తరిస్తున్న వ్యాపారం
మండలంలోని మేజర్‌ గ్రామపంచాయతీలో పన్నుల వసూల శాతం గణనీయంగా పెరిగింది. మిర్జాగూడా, జన్వాడ, మోకిలా, కొండకల్‌ తదితర గ్రామాల్లో చిన్నచిన్న వ్యాపారాలు, పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. దీంతో నిర్మాణాలు పెరిగు తుండటంతో పన్నుల శాతం కూడా గణనీయంగా పెరుగుతోంది. రైస్‌ మిల్లు, ఫంక్షన్‌హాల్‌, హౌటల్స్‌, రెస్టారెంట్లు, నిర్మితమయ్యాయి. అక్కడక్కడ పౌల్ట్రీ పాములు కూడా వెలుస్తున్నాయి. మోకిలా కొండ కల్‌ జన్వాడ లాంటి పెద్ద పెద్ద పంచాయతీల్లో విల్లాస్‌ కూడా వెలుస్తున్నాయి.
అభివృద్ధికి మూలం పన్నుల వసూళ్లు…
అభివృద్ధికి మూలం పన్నుల వసూళ్లలేనని పన్నుల వసుళ్లపై అందరి దృష్టి పెడితే వందశాతం వసూళ్లు అవుతాయని మండల స్థాయి అధికారులు ఎంపీవో చెబుతున్నారు. 2023-24 ఏడాదికి రూ.3 కోట్ల 46,87,687లు టార్గెట్‌ ఉండగా, రూ. కోటి,88 లక్షల, 65 వేల 841లు మాత్రమే వసూళ్లు అయ్యాయి. మేజర్‌ గ్రామ పంచాయతీయులైన మోకిలా, కొండాకల్‌, జన్వాడ, మహాలింగాపురంపై అధికారుల అధికారులు పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి 30 లోపు 100వంద పన్నులు వసూళ్లు చేసేందుకు ఎంపీడీవో వెంకయ్య, ఎంపీఓ గీత పర్యవేక్షిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, ప్రజాపాలన తదితర ప్రభుత్వ కార్యక్రమాలతో పంచాయతీ సిబ్బంది బిజీగా ఉండటంతో పన్నుల వసూళ్లపై దృష్టి సారించలేకపోతున్నారు.
పేరుకుపోతున్న విద్యుత్‌ బకాయిలు
కేసీఆర్‌ సర్కార్‌ హయాంలో ఏడాదికాలంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు ఎటువంటి నిధులు మంజూరు కాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మిగతా ఆర్థిక పద్దుల నిధులతోనే పంచాయతీల నిర్వహణ కొనసాగుతుంది. పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని ఆయా గ్రామాల సర్పంచులు అప్పట్లో బీఆర్‌ఎస్‌ సర్కారులోని మంత్రులను, కలెక్టర్లను కోరినా స్పందన కరువైంది. పంచాయతీలో విద్యుత్‌ లైట్లు, బోరు మోటార్లు వినియోగానికి రూపాయలు వేలల్లో విద్యుత్‌ బకాయిలు ఉంటున్నాయి. ప్రస్తుత రేవంత్‌ సర్కార్‌ గ్రామపంచాయతీలకు నేరుగా నిధులు మంజూరు చేస్తే గ్రామపంచాయతీలు ఎంతో అభి వృద్ధి చెందుతాయని పలువురు సర్పంచులు కోరుకుం టున్నారు. ఇప్పటికే నిధుల లేమితో గ్రామ పంచాయతీలు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టా డుతున్నాయని సర్పంచులు వాపోతున్నారు. రేవంత్‌ సర్కార్‌ అయినా కనికరించి గ్రామ పంచాయతులకు నేరుగా నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

Spread the love