– గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
– ములుగులో రోడ్డు భద్రత మాసోత్సవాలు
– టాస్క్ సెంటర్ ప్రారంభం
నవతెలంగాణ-ములుగు
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమావళిని పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా శనివారం సాధన స్కూల్ నుంచి సాధన స్కూల్ వరకు 3కే రన్నింగ్ పోటీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, కలెక్టర్ దివాకర్ టీఎస్, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ బానోతు రవిచందర్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పైడాకుల అశోక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. నాణ్యమైన ఆహారాన్ని తీసుకుంటూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యకంగా ఉండాలని సూచించారు. సహజ సిద్ధమైన కూరగాయలను తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, నియంత్రణ అలవర్చుకోవాలని అన్నారు. తప్పుదారుల్లో వాహనాలను నడపటం, అధిక వేగం, హెల్మెంట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలకు గురై ఎంతోమంది విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యకరంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని సూచించారు. రోడ్డుపై లభించే తినుబండారాలను విచ్చలవిడిగా తినడం వల్ల చిన్నపిల్లలకు సైతం గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయని, ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో సహజసిద్ధమైన కూరగాయలను సాగు చేసుకోవాలని చెప్పారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. ములుగు జిల్లా గిరిజన ప్రాంతమని, రోడ్డు భద్రత నియమావళిని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే వాహనాలు నడపాలని అన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ.. తాను కళాశాలలో ఉన్నప్పుడే రోడ్డు భద్రత నియమావళిని పూర్తిస్థాయిలో అవగాహన చేసుకున్నానని, జీవితం పోతే తిరిగి రాదని, రోడ్డు ప్రమాదాలలో విలువైన ప్రాణాన్ని తీసుకోవద్దని వికలాంగులుగా మారవద్దని చెప్పారు.
జిల్లాలో టాస్క్ శిక్షణ కేంద్రం ఏర్పాటు గొప్ప వరం
నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందేందుకు, ప్రతిభ పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోవడానికి జిల్లాలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేయడం గొప్ప వరమని మంత్రి సీతయ్య అన్నారు. కష్టంలో వచ్చిన విజయం జీవితాంతం సంతోషాన్నిస్తుందని చెప్పారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్‌ను కలెక్టర్ దివాకర్ టి.ఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రవి చందర్‌తో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టాస్క్ సెంటర్ మారుమూల ప్రాంతాల యువతి, యువకులకు ఎంతగానో దోహదపడుతుందని, ప్రతిభా పరిజ్ఞానం లేకపోతే ఉన్నత చదువులు చదివినా లాభం ఉండదని చెప్పారు.