– ద.మ.రైల్వే జీఎమ్ అరుణ్‌కుమార్ జైన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైళ్ల నిర్వహణలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు. జోన్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సోమవారంనాడిక్కడి రైల్ నిలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జోన్ పరిధిలోని విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్‌ఎంలు), లాలాగూడ, తిరుపతి చీఫ్ వర్క్ షాప్ మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, సిబ్బందికి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇవ్వాలని చెప్పారు. తనిఖీలు ముమ్మరం చేయాలనీ, సిమెంట్, ఆహార ధాన్యాలు, బొగ్గు ఇతర వస్తువుల లోడింగ్‌పైనా దృష్టిపెట్టి, భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అలాగే రైళ్ల సగటు వేగాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.