మార్గదర్శకాలు పాటించండి

Follow the guidelines– ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించి ఫలితాన్ని ప్రకటించండి : సీఈసీని కోరిన ఇండియా బ్లాక్‌ నేతలు
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ ప్రతినిధి బృందం ఆదివారం కేంద్ర ఎన్నికల కమిషన్‌తో సమావేశమైంది. మంగళవారం చేపట్టే కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి స్పష్టమైన, సవివరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరింది. సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వి మాట్లాడుతూ తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించాలని సీఈసీని కోరామని తెలిపారు. ‘ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత వివిధ పార్టీలతో కూడిన ప్రతినిధి బృందం సీఈసీతో సమావేశం కావడం ఇది మూడోసారి. అనేక అంశాలను ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసికెళ్లాం. ముఖ్యంగా రెండు మూడు అంశాలను ప్రస్తావించాం. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించి, ఫలితాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశాం’ అని తెలిపారు.
‘ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించాలని ఎన్నికల కమిషన్‌ నిబంధనల్లో ఉంది. ఈవీఎంలను లెక్కించడానికి ముందే పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించి ఫలితాన్ని ప్రకటించాలి. అయితే ఈ మార్గదర్శకాన్ని ఈసీ పాటించడం లేదు. దానిని పాటించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సీఈసీని కోరాం’ అని మను సింఘ్వి చెప్పారు.
కంట్రోల్‌ యూనిట్లపై సూచనలు : ఏచూరి
తాను నిర్దేశించుకున్న మార్గదర్శకాలను అమలు చేయాలని సీఈసీని కోరినట్లు సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. సీసీటీవీల పర్యవేక్షణలో ఉన్న కారిడార్ల ద్వారా ఈవీఎంల కంట్రోల్‌ యూనిట్లను తరలించాలని, ఆ యూనిట్లలోని సమాచారాన్ని, అందులో చూపిన సమయాన్ని సరిచూసుకోవాలని కోరామని వివరించారు. ‘కంట్రోల్‌ యూనిట్లను సరిచూసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే అది పోలింగ్‌ కేంద్రం నుంచి వచ్చిన యూనిట్‌ అని, దానిని మార్చలేదని నిర్ధారించుకోవడం సాధ్యపడదు’ అని తెలిపారు. పోలింగ్‌ తేదీ, ఆ ప్రక్రియ మొదలైన సమయం, ముగిసిన సమయాన్ని కంట్రోల్‌ యూనిట్‌లో సరిచూసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈవీఎంలకు సీలు వేసేటప్పుడు దానిపై ఉంచే స్లిప్పులు, ట్యాగులను వెరిఫికేషన్‌ కోసం కౌంటింగ్‌ ఏజెంట్లకు చూపించాలని ఏచూరి సూచించారు.
ఇండియా బ్లాక్‌ నేతలు శనివారం సమావేశమై కౌంటింగ్‌ రోజు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని అంశాలపై సీఈసీతో సమావేశమవుతామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. కౌంటింగ్‌ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని ప్రతిపక్ష పార్టీలు తమ ఏజెంట్లకు సూచించాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో పోలైన ఓట్లను నమోదు చేసే ఫారం 17-సీని తీసుకోవాలని కోరాయి.

Spread the love