ఎస్సార్‌ ప్రైమ్‌ కళాశాలలో ఫుడ్‌ పాయిజన్‌

– 40 మంది విద్యార్థినులకు అస్వస్థత
– వాంతులు, విరోచనాలు, ముక్కులో నుంచి రక్తం
– స్పృహ తప్పడంతో ఆస్పత్రికి తరలింపు
– ఆదివారం రాత్రి జరిగితే.. బయటకు పొక్కనివ్వని యాజమాన్యం.
నవతెలంగాణ-మట్టెవాడ
వేల రూపాయల ఫీజులు గుంజుతూ విద్యార్థులకు మంచి చదువుతోపాటు నాణ్యమైన భోజనం అందించాల్సిన పాఠశాల యాజమాన్యం పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాత్రి భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనా విషయం బయటకు పొక్కనియ్యకుండా జాగ్రత్తపడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భట్టుపల్లిలోని ఎస్సార్‌ ప్రైమ్‌ కళాశాలలో ఆదివారం రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగుజూసింది. 40 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు, ముక్కు నుంచి రక్తం కారడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వివరాలిలా ఉన్నాయి..
ఎస్సార్‌ ప్రైమ్‌ కళాశాలలో మెను ప్రకారం ఆదివారం రాత్రి విద్యార్థులకు చికెన్‌తో భోజనం పెట్టారు. తిన్న తరువాత విద్యార్థులు ఒకరి తరువాత ఒకరు వాంతులు చేసుకోవడంతోపాటు ముక్కులో నుంచి రక్తం కారడంతో స్పృహతప్పి పడిపోయారు. ఐఐటీ ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థినులు 17 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో యాజమాన్యం అంబులెన్స్‌, స్కూల్‌ బస్సులో ఉర్సుగుట్ట సమీపంలోని మెడికేర్‌ ఆస్పత్రికి తరలించింది. అత్యవసర విభాగంలో చేర్పించి చికిత్స అందించారు. ఆదివారం రాత్రి సంఘటన జరిగినప్పటికీ సోమవారం వరకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు. కొంత కోలుకున్న విద్యార్థినులు సోమవారం ఆస్పత్రి సిబ్బంది ఫోన్ల ద్వారా తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో బయటకు పొక్కింది. దాంతో కళాశాల యాజమాన్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లల కోసమని పండ్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకెళ్తే అనుమతించని యాజమాన్యం.. కలుషిత ఆహారం ఎలా అందించిందని నిలదీశారు. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని.. అప్పులు చేసి లక్షల రూపాయలు వెచ్చించి చదివిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చదువుతోపాటు పౌష్టికాహారం అందిస్తారనే ఆశతో ఎస్సార్‌ ప్రైమ్‌ కళాశాలలో చేర్చామని, కానీ నెలలోనే పిల్లలను ఆస్పత్రి పాలు చేశారని నర్సంపేటకు చెందిన ప్రయివేటు ఉపాధ్యాయుడు ఆవేదన చెందారు.
ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది
ఎస్సార్‌ ప్రైమ్‌ కళాశాలకు చెందిన 17 మంది విద్యార్థినులను ఆదివారం రాత్రి మెడికల్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారికి వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆదివారం రాత్రి వారు తిన్న ఆహారం వికటించడంతో వాంతులు, ముక్కులో నుంచి రక్తం కారడంతో అపస్మారక స్థితిలోకెళ్లిన విద్యార్థినులను ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇంటెన్స్‌ కేర్‌ యూనిట్‌ నుంచి కోలుకున్న కొందరిని జనరల్‌ వార్డుకు మార్చాం.
– చిన్నప్పరెడ్డి, మెడికేర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Spread the love