మంచాల బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌..

– 50 మంది విద్యార్థులకు అస్వస్థత..
– ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రతినిధి
బాలికల వసతి గృహంలో అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న విద్యార్థినులు ఒక్కొక్కరుగా అస్వస్థత బారిన పడ్డారు. దీంతో వారిని పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు..
రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో సుమారు 96మంది విద్యార్థులు నివాసం ఉంటున్నారు. కాగా వీరికి గత మూడు రోజుల నుంచి అన్నంలో పురుగులు వస్తున్నాయని హాస్టల్ ఇన్చార్జి వార్డెన్ సరిత, వర్కర్ల దృష్టికి తీసుకుపోయారు. అయినా వారు పట్టించుకోలేదు. విద్యార్థులు చేసేది లేక అదే భోజనాన్ని తీసుకున్నారు. కాదా శనివారం ఉదయం సైతం అదే విధంగా అన్నంలో పురుగులు రావడంతో ఆకలితో కొంతమంది విద్యార్థినిలు తినగా, మరికొంత మంది తమ ప్లేట్లో పెట్టుకున్న భోజనాన్ని పక్కకు పడేశారు. ఈ క్రమంలో పురుగులు వస్తున్నాయని తెలిసిన.. ఆకలితో తట్టుకోలేక పురుగులు తీసి అన్నాన్ని తిన్నారు. దాంతో పురుగుల అన్నం తిన్న విద్యార్థులకు ఒక్కొక్కరికి వాంతులు రావడం ప్రారంభమైంది. అయితే ప్రతిరోజు పక్కనే ఉన్న పాఠశాలలో ప్రేయర్ సమయానికి హాస్టల్ విద్యార్థులందరూ చేరుకునేవారు. అయితే శనివారం పాఠశాలలో ప్రార్థన సమయం కావస్తున్న హాస్టల్ విద్యార్థినిలు ఒక్కరు కూడా పాఠశాలలకు చేరుకోలేదు. దాంతో పాఠశాల ఉపాధ్యాయులు హాస్టల్ వద్దకు చేరుకొని వాకబ్ చేశారు. ఇప్పటి వరకు విద్యార్థులు ఎవరు పాఠశాలకు ఎందుకు రావడం లేదని గేటు బయట ఉన్న విద్యార్థినిలను ప్రశ్నించగా గత మూడు రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని ఈ రోజు కూడా అదే విధంగా రావడం వల్ల తిన్న తోటి విద్యార్థినిలకు వాంతులు కావడంతో హాస్టల్లోనే పడుకుండిపోయారని సమాచారం ఇచ్చారు. దాంతో అస్వస్థతకు గురైన 25 మంది విద్యార్థినిలను పాఠశాల ఉపాధ్యాయులు తమ కార్లలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారందరికీ చికిత్సలు అందిస్తున్నారు. వీరిలో ఆరుగురు విద్యార్థినిల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్సలు అందిస్తున్నారు.
చెట్లపై ఉన్న పురుగులే కారణం : వార్డెన్ సరిత
హాస్టల్ విద్యార్థులు తమ ప్లేట్లో అన్నం పెట్టుకున్న తర్వాత చెట్ల కింద కూర్చొని తింటున్నారని, ఆ చెట్లపై ఉన్న పురుగులు పడడం వల్లనే అస్వస్థకు గురైనట్లు హాస్టల్ ఇన్చార్జి వార్డెన్ సరిత నవతెలంగాణతో తెలిపారు. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని మరి కొంతమందికి విద్యార్థులను నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. కాగా విద్యార్థినుల అస్వస్థతకు కలుషిత ఆహారమే కారణం అని, ఇందుకు హాస్టల్‌ వార్డెనే బాధ్యురాలని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు.

Spread the love