– సిబిల్ స్కోరుంటేనే బ్యాంక్‌ల్లో ఉద్యోగం
– కనీసం 650 ఉండాల్సిందే
– విద్యా రుణాలు చెల్లించకపోతే అనర్హులు
– ఐబిపిఎస్ కొత్త నిబంధనలు
– బ్యాంకింగ్ సంఘాల మండిపాటు
హైదరాబాద్ : ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో ఉద్యోగం పొందాలంటే ఇంతక్రితం పోటీ పరీక్ష రాసి.. మెరిట్ సాధిస్తే సరిపోయేది. కానీ దీనికి ఇన్స్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్ (ఐబీపీఎస్) కొత్త చిక్కుముడి పెట్టింది. బ్యాంక్ ఉద్యోగాలను భర్తీ చేసే ఈ సంస్థ అభ్యర్థుల సిబిల్ స్కోర్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిపింది. జులై 1న ఐబీపీఎస్ జారీ చేసిన క్లర్క్‌ల రిక్రూట్మెంట్ కోసం కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో పలు నిబంధనను విధించింది. సిబిల్ స్కోర్ కనీసం 650 ఉండాలని షరతు విధించింది. అదే విధంగా విద్యా రుణం పొంది.. తిరిగి చెల్లించలేని వారిని అనర్హులుగా నిర్ణయిస్తున్నది. బ్యాంకింగ్ ఉద్యోగాలకు సన్నద్దమయ్యే సమయంలో సిబిల్ స్కోర్‌ను కూడా పరిశీలించుకోవాలని సూచించింది.ఉద్యోగానికి ఎంపికై చేరే ముందు సిబిల్ స్టేటస్‌ను సమర్పించాల్సిందే. అప్పటికే రుణాలు పొంది ఉంటే ఎలాంటి రుణ బకాయిలు లేవని సంబంధిత బ్యాంకర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను సమర్పించాలని ఐబిపిఎస్ తన నోటిఫికేషన్లో పొందుపర్చింది. సిబిల్, విఫలమయితే అర్హత ప్రమాణాల ప్రకారం ఉద్యోగ చేరిక ఆఫర్ లెటర్‌ను ఉపసంహరించుకోవచ్చు లేదా రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. సిబిల్ నివేదిక అనేది వ్యక్తుల రుణ చరిత్ర, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల విశ్లేషణ ఆధారంగా వారి సామర్థ్యాన్ని సూచించే పరపతి. సిబిల్ స్కోర్ అనేది 300 మరియు 900 మధ్య ఉండే మూడు అంకెల సంఖ్య. క్రెడిట్ ప్రొఫైల్‌లో గృహ రుణాలు, క్రెడిట్ కార్డ్‌లు, వ్యక్తిగత, వాహన, ఓవర్‌డ్రాప్ట్ రుణాలు తదితర వాటి చెల్లింపు చరిత్ర ఆధారంగా సిబిల్ స్కోర్ నిర్ణయించబడుతుంది. విద్యార్థులు తమ చదువుల నిమిత్తం విద్యా రుణాలు పొంది.. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల చెల్లింపుల్లో విఫలమైతే ఐబిపిఎస్ నిబంధనల వల్ల బ్యాంక్ ఉద్యోగం పొందడం వీలు కాదు. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని బ్యాంకింగ్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కొత్త షరతును ఎత్తివేయాలి : బెఫీ
ఐబిపిఎస్ ప్రవేశపెట్టిన కొత్త షరతును ఎత్తివేయాలని బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బెఫీ) జనరల్ సెక్రటరీ దేబాషిష్ బసు చౌదరి డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన ఐబిపిఎస్ ఛైర్మన్‌కు లేఖ రాశారు. సిబిల్ స్కోర్ 650 ఎగువన ఉండాలనే నిబంధనలో ఎలాంటి లాజిక్ లేదన్నారు. విద్యా రుణాలు పొందే సమయంలోనే తల్లిదండ్రుల బాధ్యతతోనే భవిష్యత్తు చెల్లింపుల పూచీతో రుణాలు ఇవ్వబడుతాయని ఆయన గుర్తు చేశారు. నియామకాల్లో విద్యా రుణాలను, సిబిల్ స్కోర్‌తో ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు. తక్షణమే ఈ షరతును ఉపసంహరించుకోవాలని కోరారు.