మోడీ కండ్లల్లో ఆనందం కోసమేనా…!?

For happiness in Modi's eyes...!?– ‘నర్మద’ నీటి విడుదలలో జాప్యం చేసిన అధికారులు
– ప్రవాహం పెరిగి ఆకస్మికంగా వచ్చిపడిన వరదలు
– పంట పొలాలను ముంచెత్తిన నీరు…భారీ నష్టం
– మండిపడిన ప్రతిపక్షం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా ఈ నెల 17న అట్టహాసంగా నిర్వహించారు. అయితే అదే రోజు ఆయన కళ్లలో ఆనందం చూడడానికి గుజరాత్‌లో నర్మద నదిపై నిర్మించిన సర్దార్‌ సరోవర్‌ డ్యాం నుండి నీటి విడుదలను బీజేపీ ప్రభుత్వం ఆలస్యం చేసింది. ఆ తర్వాత నాలిక కరుచుకొని ఆకస్మికంగా నీటిని విడుదల చేయడంతో డ్యాం దిగువనున్న భరూఛ్‌ జిల్లాలో వరదలు సంభవించి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఇది మానవ తప్పిదమేనని ప్రతిపక్షాలు, పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. ప్రభుత్వం మాత్రం నోరు విప్పడం లేదు.
‘మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు పడ్డాయి. దిగువన ఉన్న నర్మద నదిలో నీటి ప్రవాహం పైన, నీటి మట్టం పైన గంటగంటకూ పరిశీలన జరపాల్సిన అవసరం ఉంది. నదిలో అధికంగా చేరుతున్న నీటిని దిగువకు వదలాల్సి ఉంది. కానీ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఈ నెల 15, 16 తేదీలలో నీటిని దిగువకు వదలలేదు. డ్యాం నిండి, పొంగిపోయే వరకూ ఎదురు చూశారు. బహుశా ఎవరినో సంతోషపరచేందుకే ఇలా చేసి ఉంటారు. డ్యాం నిండడంతో వెంటనే నీటిని పెద్ద ఎత్తున కిందికి వదిలారు. దీంతో పంట పొలాలు నీట మునిగి రైతులు ఆర్థికంగా నష్టపోయారు’ అని కాంగ్రెస్‌ ప్రతినిధి మనీష్‌ దోషీ తెలిపారు. జన్మదినోత్సవం సందర్భంగా మోడీని సంతోషపెట్టడానికే ఇలా చేసి ఉండవచ్చునని ఆయన ఎద్దేవా చేశారు. నీటిని సకాలంలో విడుదల చేసి ఉంటే గుజరాత్‌లోని ఐదు జిల్లాలలో వరదలు రాకుండా నివారించి ఉండేవారని చెప్పారు. ఇది కచ్చితంగా మానవ తప్పిదమేనని స్పష్టం చేశారు.
డ్యాం నుండి 18 లక్షల క్యూసెక్కుల నీటిని ఒక్కసారిగా వదిలారని మనీష్‌ తెలిపారు. నీటి విడుదలలో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, వారి ఆస్తులు జప్తు చేసి వచ్చిన డబ్బుతో బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా సర్దార్‌ సరోవర్‌ నర్మదా కార్పొరేషన్‌ ప్రణాళికాబద్ధంగా నీటిని విడుదల చేసి ఉంటే లక్షలాది ఎకరాలకు సాగు నీరు అంది ఉండేదని గుజరాత్‌ పీసీసీ రైతు విభాగం అధ్యక్షుడు పాల్‌ అంబాలియా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ చర్యతో కొందరి ప్రయోజనాలు నెరవేరి ఉండవచ్చేమో కానీ వేలాది మంది రైతులు పెద్ద ఎత్తున పంటను నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సౌరాష్ట్ర, కచ్‌, ఉత్తర గుజరాత్‌ ప్రాంతాల రైతులు గత నెల రోజులుగా నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారని, కానీ అధికారులు నీటిని విడుదల చేయలేదని, 17వ తేదీ వరకూ (మోడీ జన్మదినం) ఎదురు చూశారని మండిపడ్డారు. మోడీ జన్మదినం నాడు సర్దార్‌ సరోవర్‌ డ్యాం పొంగిపోయేలా చూడడానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఇందిరాసాగర్‌ డ్యాం నుండి 9.45 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిందని విమర్శించారు.
వరదలకు ప్రకృతి వైపరీత్యం కారణమా లేక మానవ తప్పిదం కారణమా అనేది తెలియక ప్రజలు ఆశ్చర్యపడుతున్నారని ఆమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇసుదన్‌ ఘద్వీ వ్యాఖ్యానించారు. ఎవరి నుండో ప్రశంసలు పొందేందుకు ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇలాంటి చర్యలకు పాల్పడడం అవసరమా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉందని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు దృష్టిలో పెట్టుకోవాలని హితవు పలికారు.
మానవ తప్పిదమేనన్న పరిశోధనా కేంద్రం
గుజరాత్‌లో సంభవించిన వరదలకు మానవ తప్పిదమే కారణమని బ్రాకిష్‌ జల పరిశోధనా కేంద్రం తేల్చి చెప్పింది. భరూఛ్‌లో వరదలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని తెలిపింది. ఈ మేరకు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు ఈ-మెయిల్‌ పంపింది. ‘సర్దార్‌ సరోవర్‌ డ్యాంకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంచనాలను, గణాంక సమాచారాన్ని కేంద్ర జల సంఘం సర్దార్‌ సరోవర్‌ నర్మదా కార్పొరేషన్‌ అధికారులకు పంపింది. డ్యాం నుండి 11 లక్షల క్యూసెక్యుల నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. దానికి రెట్టింపు స్థాయిలో డ్యాం లోకి 22.58 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరవచ్చునని తెలిపింది. దీనివల్ల డ్యాం నిర్వహణ కష్టమవుతుందని చెప్పింది. కేంద్ర జలసంఘం అంచనాలను గుజరాత్‌ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తెచ్చి ఉండాల్సింది’ అని అధ్యయన కేంద్రం అభిప్రాయపడింది. ఈ నెల 14 నుండే నీటి నిర్వహణపై తగిన శ్రద్ధ పెట్టి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని, ఇది కచ్చితంగా మానవ తప్పిదమేనని స్పష్టం చేసింది.అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం అధికారులు భారత వాతావరణ శాఖ అందించిన సూచనలు, వర్షపాతం వివరాలు, కేంద్ర జలసంఘం అంచనాలు, ఎగువ ప్రాంతం నుండి వచ్చే నీటి ప్రవాహం వంటి అంశాలను నిరంతరం పరిశీలించలేదని, అత్యవసర ముందుజాగ్రత్త చర్యలు చేపట్టలేదని అధ్యయన కేంద్రం ఎత్తి చూపింది. ’14వ తేదీన నర్మదా బర్గీ డ్యాం గేట్లను ఎత్తేశారు. 15వ తేదీ సాయంత్రానికి ఇందిరాసాగర్‌, ఓంకారేశ్వర్‌ డ్యాంలలో నీటి మట్టం పెరగడం మొదలైంది. ఈ రెండు డ్యాంలలో నీటి మట్టం ఆ రాత్రికే పూర్తి రిజర్వాయర్‌ స్థాయికి చేరింది. బిర్డీ డ్యాంలో కూడా ఇదే పరిస్థితి. అధికారులు దీనిని గుర్తించే సరికే పరిస్థితి చేయి దాటి పోయింది’ అని అధ్యయన కేంద్రం అధ్యక్షుడు, పర్యావరణవేత్త ఎంఎస్‌హెచ్‌ సైఖ్‌ చెప్పారు. డ్యాం నిండిపోయిందని ముఖ్యమంత్రికి చూపించడానికే అధికారులు సకాలంలో నీటిని విడుదల చేయలేదని, పదోన్నతుల కోసమే వారు డ్యాం నిండే దాకా వేచి చూశారని అధ్యయన కేంద్రం తెలిపింది. చివరికి నీటి ప్రవాహం డ్యాంను పూర్తిగా నింపేయడంతో అధికారులు విధిలేక నీటిని వదిలారని, దీంతో వరదలు సంభవించాయని వివరించింది.

Spread the love