– బ్యారేజీపై కాంట్రాక్టర్లకు కాళేశ్వరం కమిషన్ ప్రశ్న
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రాజెక్టుల పనులు ప్రారంభించే ముందు అన్ని అంశాలను పూర్తిస్థాయిలో సరిచూసుకోవాల్సిన బాధ్యత నిర్మాణసంస్థలపై లేదా అని కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ చైర్మెన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. టెండర్ల వ్యవహారం అసమగ్రంగా ఉన్నప్పుడు వాటి గురించి ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించలేదని అడిగారు. ముందేజాగ్రత్తలు తీసుకుని ఉంటే నష్టం జరిగేది కాదని వ్యాఖ్యానించారు. అన్నారం బ్యారేజీని నిర్మించిన ఆఫ్కాన్స్ సంస్థ ప్రతినిధులు నాగ మల్లిఖార్జునరావు, శేఖర్‌దాస్ కాళేశ్వరం కమిషన్ ఎదుట శనివారం విచారణకు హాజరయ్యారు. గతంలో వారు దాఖలుచేసిన అఫిడవిట్ల ఆధారంగా కమిషన్ వారిని ప్రశ్నించింది. పనులకు సంబంధించిన ఒప్పందాలు, అందులోని అంశాలు, పనుల ప్రారంభం, ఆలస్యానికి గల కారణాలు, తలెత్తిన సమస్యలు, తీసుకున్న చర్యలు తదితర అంశాలపై వారిని కమిషన్ చైర్మెన్ ప్రశ్నించారు.
బ్యారేజీ ప్రతిపాదిత లోకేషన్ మార్చడం, భూమి అప్పగింతలో ఆలస్యం జరగడంతోనే పనుల ప్రారంభానికి కొంత సమయం పట్టిందని ఆఫ్కాన్స్ ప్రతినిధులు వివరించారు. సైట్‌కు వెళ్లేందుకు మార్గంకూడా లేకపోవడంతో ఏడాదిపాటు ప్రయివేటు వ్యక్తుల నుంచి భూములు లీజుకు తీసుకున్నట్టు తెలిపారు. ముఖ్యమైన పనులు చేసే క్రమంలో అన్ని అంశాలను పూర్తిస్థాయిలో చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. కేవలం కాంట్రాక్టు, డబ్బులు వస్తున్నాయి కదా అని మాత్రమే చూసుకుంటే ఎలా అని కమిషన్ ప్రశ్నించిందని చెప్పారు. వందేండ్లు ఉండాల్సిన బ్యారేజీలో ఏడాదికే సమస్యలు ఎందుకు వచ్చాయని కమిషన్ అడిగింది. ఈపీసీ ఒప్పందం అయి ఉంటే సర్వే సహా అన్ని అంశాలను తామే చూసుకునే వాళ్లమని ఆఫ్కాన్స్ ప్రతినిధులు చెప్పారు. ప్రొటెక్షన్ వర్క్స్ విషయమై నీటిపారుదల శాఖతో సంప్రదింపులు చేసినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీ తరహా ప్రొటెక్షన్ వర్క్స్ గురించి చర్చించినట్టు పేర్కొన్నారు. సీసీ బ్లాకులు దెబ్బతిన్న తర్వాత కన్సెల్టెన్సీతో అధ్యయనం చేయించామనీ, ఆ సిఫారసులపై నీటి పారుదలశాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. అన్నారం ఆనకట్టకు ఎలాంటి పగుళ్లు రాలేదనీ, ఒకసారి సీపేజీ సమస్య వస్తే వెంటనే గ్రౌటింగ్ చేసి అరికట్టినట్టు ఆఫ్కాన్స్ ప్రతినిధులు కమిషన్‌కు తెలియజేశారు.